బాలయ్య పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేడు ఆయన హిందూపురంలో ఓ శుభకార్యానికి హాజరవ్వగా ఓ వైసీపీ నేత ఆయన కారును అడ్డుకున్నాడు. పోలీసుల జోక్యంతో ఆ ఘటన సద్దుమణిగింది.
సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) పది నెలల తర్వాత తన సొంత నియోజకవర్గం హిందూపురం (Hindupur)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత అశ్వర్థరెడ్డి కుమార్తె విహహానికి బాలకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమం చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా మధు అనే వైసీపీ నేత బాలయ్య కారును అడ్డుకున్నారు. ప్లకార్డును చేతబట్టి మధు వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వైసీపీ (YCP) నేత మధు (Madhu) తాను తీసుకొచ్చిన ప్లకార్డును బాలయ్య కారుపై విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మధును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ప్లకార్డు కర్ర అక్కడే ఉన్న ఎస్ఐకి తగిలింది. పోలీసులు మధును పట్టుకునే ప్రయత్నం చేయగా అంతలోనే మధు పరారయ్యాడు.
ఈ సంఘటన తర్వాత బాలయ్య కాన్వాయ్ బయల్దేరి వెళ్లింది. హిందూపురంలో ఓ వైపు బాలయ్య పర్యటన సాగనుండగా మరో వైపు వైసీపీ బస్సు యాత్ర సాగుతోంది. అయితే టీడీపీ, వైసీపీ నేతలు ఎదురుపడినప్పుడు వాగ్వాదం చోటుచేసుకునే అవకాశం కూడా ఉంది. అందుకే పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. రెండు పార్టీల సమావేశాలు ఒక ప్రదేశంలో జరగకుండా జాగ్రత్తపడుతున్నారు.