»Ap Weather Update Meteorological Department Alert Danger Warning Issued In Ap
AP Weather Update : వాతావరణశాఖ అలర్ట్..ఏపీలో ప్రమాద హెచ్చరిక జారీ
ఏపీలో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దాని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని, మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గత ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో పయనించడం వల్ల వర్ష ప్రభావం తీవ్రంగా ఉండనుందని తెలిపింది.
తీవ్ర వాయుగుండం శుక్రవారం పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటే అవకాశం ఉందని, ఆ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. తీరం వెంబడి గాలులు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, తీరాలకు దగ్గరగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.