మరికొన్ని గంటల్లో టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర కుప్పం నుంచి జరగనుంది. గురువారం రాత్రి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు లోకేశ్ చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. మహిళలు హారతి ఇచ్చి దిష్టి తీశారు. గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ సీనియర్ నేతలు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం పాదయాత్ర తొలిరోజు.. కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభకు 50 వేల మందికి పైగా టీడీపీ కార్యకర్తలు వస్తారని చెబుతున్నారు. సభలో వేదికపై 400 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 10.15 గంటల సమయంలో వరదరాజుల స్వామి ఆలయంలో నారా లోకేశ్ ప్రత్యేక పూజలు చేస్తారు. 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. తొలిరోజు పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర 3 రోజులు 29 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కుప్పం తర్వాత పలమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సాగే పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు జరగనుంది. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు.