ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి దేశ అభివృద్ధి గురించి ధ్యాస లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపైకి ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు కుట్రలు చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం, విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలనే ఆలోచిస్తుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు వచ్చిందని విమర్శించారు. 75 ఏళ్లలో దేశం చాలా వెనుకబడిందన్నారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రుల పాలనకు గవర్నర్లు అడ్డుపడుతున్నారన్నారు. జపాన్, సింగపూర్, జర్మనీ.. ఇలా ఎన్నో దేశాలు మనకంటే ముందున్నాయి. కానీ మనం మాత్రం ఈ ఏడు దశాబ్దాల్లో వెనుకబడ్డామన్నారు. పరిపాలకులు సరిగ్గా లేకపోవడం వల్లే దేశం నష్టపోయిందన్నారు. ఇప్పటికైనా మనమంతా దేశం అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు.
కేసీఆర్ కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమమని కితాబిచ్చారు. ఈ పథకాన్ని తాను ఢిల్లీకి వెళ్లాక ప్రారంభిస్తానని, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమం నుండి తాము ఎంతో నేర్చుకున్నామని, కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారన్నారు. మనం గొడవలు పడకూడదని, ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవాలన్నారు. 17 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు ఏర్పాటు చేశారని, బాగుందని చెప్పారు. సమీకత కలెక్టరేట్లు అనే కాన్సెప్ట్ బాగుందని, ప్రజలకు అన్ని పనులు ఒకేచోట జరుగుతాయన్నారు. ఢిల్లీలో తాము ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్ ఏర్పాటు చేశామని, కేసీఆర్ స్వయంగా వచ్చి వాటిని చూసి, ఇక్కడ బస్తీ దవాఖానా పేరుతో అమలు చేశారన్నారు. ఢిల్లీ స్కూల్స్ నుండి తమిళనాడు సీఎం స్టాలిన్ అమలు చేస్తున్నారన్నారు.