»Vijaysai Reddy Vijaysai Reddy Has An Unbreakable Relationship With The Ys Family
VijaySai Reddy: విజయసాయి రెడ్డికి వైఎస్ కుటుంబంతో అవినాభావ సంబంధం
నెల్లూరు ఎంపీ అభ్యర్ధి పోటీ రసవత్తరంగా మారింది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దూకారు. టీడీపీ అభ్యర్ధి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీ కొంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఎదుగుదల గురించి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాజకీయ వేత్తగా ఉన్న విజయసాయి రెడ్డి గతంలో ఏం చేసేవారు? వైఎస్ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు? ప్రధాని నరేంద్ర మోడీకి ఎలా దగ్గర కాగలిగారు? వంటి ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నారు.
VijaySai Reddy: Vijaysai Reddy has an unbreakable relationship with the YS family
VijaySai Reddy: నెల్లూరు లోక్‌సభ అభ్యర్ధిగా వైసీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన విజయసాయి రెడ్డి.. వైఎస్ కుటుంబానికి ఎంతో ఆప్తుడు. గత 40 ఏళ్లుగా వారితో ఎంతో ఆప్యాయంగా ఉండే విజయసాయి రెడ్డి వృత్తి రీత్యా చార్డెడ్ అకౌంటెంట్. దేశంలో అనేక నగరాల్లో విజయసాయి రెడ్డికి కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం తాళ్లపూడి గ్రామంలో 1957లో జన్మించిన విజయసాయి రెడ్డి చిన్నతనం నుంచి చురుగ్గా ఉండేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత చెన్నై వెళ్లి చార్డెడ్ అకౌంటెన్సీ పూర్తి చేశారు. వీఎస్ రెడ్డి అసోసియేట్స్ పేరిట చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే పాపులారిటీ సంపాదించారు.
1978లో విజయసాయి రెడ్డి వివాహం జరిగింది. కాంగ్రెస్ నేత, లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గపు ఎమ్మెల్యే గండికోట రామసుబ్బారెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో పరియం అయింది. అక్కడి నుంచి వారి పరిచయం కొనసాగింది. వైఎస్ కుటుంబ ఆర్ధిక వ్యవహారాలను చూసుకునేందుకు విజయసాయి రెడ్డిని నియమించారు. అక్కడి నుంచి వైఎస్ కుటుంబంతో విజయసాయి రెడ్డి ప్రయాణం కొనసాగుతూ వస్తోంది. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి రాక ముందు అనేక వ్యాపారాలు చేసేవారు. ఆ సమయంలో ఆ కంపెనీలు అన్నింటికీ విజయసాయి రెడ్డే చార్డెట్ అకౌంటెంట్‌గా ఉన్నారు. 2004వ సంవత్సరం నుంచి విజయసాయి రెడ్డి తన ఇతర వ్యాపారాలను పూర్తిగా తగ్గించుకున్నారు. వైఎస్ కుటుంబ ఆర్ధిక వ్యవహారాలను మాత్రమే చూసుకోవడం మొదలు పెట్టారు.
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి .. విజయసాయి రెడ్డిని తగిన రీతిలో ఆదరించారు. పదవులు కట్టబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా రెండు సార్లు అవకాశం కల్పించారు. అనేక విదేశీ పర్యటనలు చేసేందుకు అవకాశం కల్పించారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. ఆ సమయంలో విజయ సాయి రెడ్డి అమెరికాలో ఉన్నారు. దాంతో ప్రమాణ స్వీకారాన్ని ఒక రోజు వాయిదా వేసుకున్నారు వైఎస్. 2009 సెప్టెంబర్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత .. విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోయారు. జగన్ కంపెనీలకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలను మాత్రమే చూసుకునేవారు.
విజయసాయి రెడ్డి .. జగన్‌కి మరింత దగ్గర మనిషి. కాంగ్రెస్ పార్టీని వీడి కొత్తగా పార్టీని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి జగన్‌కు అండగా నిలిచారు విజయసాయి రెడ్డి. జగన్ కూడా విజయసాయి రెడ్డికి అనేక కీలక బాధ్యతలు అప్పగించారు. కీలక పదవులు కట్టబెట్టారు. రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు. ఢిల్లీ పెద్దలతో విజయసాయికి చొరవ ఏర్పడానికి సీఎం జగన్ అందించిన అండదండలే కారణం. ఇలా ఒకరికి ఒకరు అన్నట్లుగా వీరిద్దరూ ముందుకు నడుస్తున్నారు. నెల్లూరు నుంచి లోక్‌సభ అభ్యర్ధిగా విజయసాయిని రంగంలో దించిన జగన్ … అక్కడి వెళ్లి ప్రచారం చేశారు. విజయసాయిని గెలిపించాలని నెల్లూరు ఓటర్లను కోరారు.