»Tdp Ap Chief Kinjarapu Atchannaidu Fire On Ys Jagan Vontimitta Visit
YS Jagan కాలు బెణకడం ఓ డ్రామా.. కుంటిసాకులతో కుట్ర: అచ్చెన్నాయుడు
రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. అంతర్వేదిలో రథం దగ్ధం ఇలా సీఎం జగన్ తర్వాత అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 280కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి.
కాలు బెణికి గాయం కారణంగా సీఎం జగన్ (YS Jagan) ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో పాల్గొనలేరని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తెల్లారే బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ (Family Doctor) కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొనడం ప్రజలను విస్మయానికి గురి చేసింది కాలు బెణికి విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటించి. మరి జగన్ ఏంటి ఇలా తిరుగుతున్నాడు అనే సందేహాలు మొదలయ్యాయి. దీనిపై రాజకీయ వివాదం మొదలైంది. జగన్ కాలునొప్పి అంటూ డ్రామాలు ఆడుతున్నాడని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విమర్శించాడు. ఉద్దేశపూర్వకంగానే ఒంటిమిట్ట రామయ్య కల్యాణోత్సవానికి కాలునొప్పి సాకుతో దూరమయ్యారని మండిపడ్డారు.
శ్రీరామనవమి సందర్భంగా కడప జిల్లాలోని ఒంటిమిట్ట (Vontimitta) ఆలయంలో వైభవోపేతంగా సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. భద్రాచలం సీతారాముల ఆలయం తెలంగాణకు వెళ్లిపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట ఆలయంలో ప్రభుత్వం తరఫున కల్యాణం నిర్వహించడం ప్రారంభించారు. ప్రతి ఏడాది అక్కడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణంలో పాల్గొంటారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అలానే వచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్సవాలపై నిర్లక్ష్యం పెరిగింది. మొదట్లో ఉత్సవాలకు హాజరైన జగన్ ప్రస్తుతం ఒంటిమిట్ట ఆలయానికి రావడం లేదు.
తాజాగా ఈనెల 7న జరిగిన కల్యాణోత్సవానికి కాలునొప్పి (Foot Pain) పేరు చెప్పి సీఎం జగన్ హాజరు కాలేదు. అయితే బుధవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి, గురువారం చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి జగన్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సవాలను తప్పించుకునేందుకు డ్రామాలు ఆడారని తెలుస్తోంది. ఒక్క రోజులోనే కాలునొప్పి తగ్గిందా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే బెణకని కాలు.. సీతారాముల కల్యాణం ముందు రోజే బెణుకుతుందా? అని నిలదీశారు. జగన్ తన వ్యవహార శైలితో కోట్ల మంది హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు.
మంగళగిరిలోని (Mangaligiri) పార్టీ కార్యాలయంలో గురువారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ వేరే మతాన్ని ఆచరించొచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఒంటిమిట్టకు వెళ్లాలి. పార్టీ నాయకుల శుభకార్యాలకు సతీసమేతంగా వెళ్లే జగన్ హిందూ దైవ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ పై ఎందుకు సంతకం పెట్టలేదు? రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. అంతర్వేదిలో రథం దగ్ధం ఇలా సీఎం జగన్ తర్వాత అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 280కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అన్ని మతాలు, కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జగన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.