టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గానికి చేరుకుంది. నేడు లోకేశ్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. కాణిపాకం ఆలయంలోని అర్చకులు లోకేశ్‌కు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
యువగళం పాదయాత్రలో లోకేశ్‌ను ఆశా వర్కర్లు కలిశారు. తమపై ప్రభుత్వం తీవ్ర పనిభారాన్ని మోపుతోందని, విధి నిర్వహణలో అనారోగ్యం పాలవుతున్న వారు చాలా మంది ఉన్నారని, కొందరైతే అర్థాంతరంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఆశా వర్కర్లను, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు.
లోకేశ్ స్పందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలం నుంచి సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లపై ఏపీ సర్కార్ చిన్నచూపు చూస్తోందన్నారు. ఆశా వర్కర్ల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఆశావర్కర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.