అరాచక పాలన సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలంతా (MLAs) పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో (Nellore District) చోటుచేసుకున్న పరిణామాలే సాక్ష్యం. ముగ్గురు కీలకమైన ఎమ్మెల్యేలు, జిల్లాలోనే పెద్ద దిక్కుగా ఉన్న నేతలు పార్టీపై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే వారితో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మాట్లాడిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు వైసీపీ అవకాశాలు చూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన కీలక నాయకుడికి వల వేసింది. వైసీపీ నాయకులు కాళ్ల బేరానికి దిగడంతో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు పార్టీ మారబోతున్నాడని సమాచారం.
నెల్లూరు జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవవేంద్ర రెడ్డి (Bommireddy Raghavendra Reddy) పార్టీ మారుతున్నాడని చర్చ జరుగుతోంది. తమ పార్టీలోకి రావాలని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా ఉన్న రాఘవేంద్ర రెడ్డికి పరిస్థితులు అనుకూలంగా లేవు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు కానీ ఫలించలేదు. తర్వాత వైసీపీలోకి అక్కడ అదే పరిస్థితి. ఇక టీడీపీలో చేరినా కూడా అతడికి ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు.
ప్రస్తుతం టీడీపీలోనే రాఘవేంద్ర రెడ్డి పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉన్నాడు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మారడంతో వైసీపీ ప్రత్యామ్నాయ చర్యలు మొదలుపెట్టింది. మూడు నియోజకవర్గాల్లో కోలుకోలేని దెబ్బ తగలడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆత్మకూరు (Atmakur) నియోజకవర్గానికి చెందిన రాఘవేంద్రను పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలికింది. కాళ్ల బేరాలు చేయడంతో రాఘవేంద్ర రెడ్డి చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే వస్తానని పట్టుబట్టాడని సమాచారం. టికెట్ పై హామీ ఇస్తేనే కండువా కప్పుకుంటానని చెప్పాడని.. దీనికి వైసీపీ అధిష్టానం పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది. బేరసారాలు అన్ని కుదరడంతో రాఘవేంద్ర రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరనున్నాడు. ఈ నాయకుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటాడని వినిపిస్తున్న మాట.