ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి సూర్య దేవాలయంలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
Ratha Saptami celebrations in arasavalli : అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయంలో రథ సప్తమి వేడుకలు కనుల విందుగా జరుగుతున్నాయి. స్వామి వారి నిజ రూప దర్శనంతో భక్తులు పులకించారు. గురువారం రాత్రి 12గంటల నుంచీ ప్రత్యక్ష నారాయణుడి దర్శనం శోభాయమానంగా జరిగింది. శ్రీ సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం పూజల్ని రథసప్తమి పర్వదినాన జరుపుతారు. ఈ పూజల్ని శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో పెద్ద ఎత్తున క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే భక్తులకు దర్శన భాగ్యం కలిగించడంతో వారు రాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
మాఘ శుద్ధ సప్తమిని సూర్య జయంతిగా, రథ సప్తమిగా చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రథ సప్తమి నాడు ప్రాతః కాల సూర్యకిరణాలచే పుణ్య క్షేత్రాలు మహా మహిమాన్వితంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సమయంలో సూర్య భగవానుడిని పూజిస్తే ఆరోగ్యం, ఆదాయం, ఐశ్వర్యం, సంతాన భాగ్యం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఆరోగ్య కారకుడిగా, రోగ నివారకుడిగా, ప్రత్యక్ష భగవానుడిగా సూర్యుడిని కీర్తిస్తారు. అందువల్లనే ఈ రోజున ప్రసిద్ధ సూర్య దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలలోని అరసవల్లి (arasavalli) సూర్యదేవాలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గుజరాత్లోని మోదెరా సూర్యదేవాలయం లాంటివి ప్రసిద్ధ ఆలయాలుగా పేరుగాంచాయి. ఈ రోజు ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనాలతో భక్తులు కిటకిటలాడుతున్నారు.