Ratha Saptami : రథ సప్తమి సందర్భంగా సూర్య ప్రభ వాహనంపై మలయప్ప స్వామి
శుక్రవారం రథ సప్తమి పర్వ దినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేకంగా సూర్య వాహనాన్ని అధిరోహించు భక్తులను కటాక్షించారు. భక్తులు పరవశంతో ‘గోవిందా గోవింద’ అంటూ స్వామిని దర్శించి పునీతులయ్యారు.
Ratha Saptami in Tirumala: రథ సప్తమి వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మలయప్ప స్వామి సూర్య ప్రభ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాన్ని చూడ్డానికి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
తిరుమలలో ఈ తెల్లవారు జాము నుంచే సూర్య ప్రభ వాహన సేవ మొదలైంది. శ్రీవారు ఆలయ వాయువ్య దిక్కకు చేరుకుని ఉండగా సూర్యోదయం అయ్యింది. భానుడి కిరణాలు స్వామి వారి పాదాల్ని తాకిన దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. గోవింద నామ స్మరణతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. ఆ తర్వాత స్వామిని మాడ వీధుల్లో ఊరేగించారు. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతిచ్చారు.
రథ సప్తమి ప్రాశస్త్యం :
సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా చెబుతారు. రోగ నివారకుడిగా కీర్తిస్తారు. ఈ సృష్టి, ప్రకృతి మొత్తం ఆయన కిరణాల వల్లనే జీవం పొంది ప్రజ్వల్లితోంది. అందుకనే సూర్యుడిని ప్రత్యక్ష భగవానుడు అంటూ కీర్తిస్తారు. మాఘ మాసం శుక్త పక్ల సప్తమిని సూర్య జయంతిగా, రథ సప్తమిగా(Ratha Saptami) జరుపుకొంటారు. సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి ఉత్తరాయణాన్ని ప్రారంభిస్తారని భక్తులు నమ్ముతారు. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.