ఏపీ, తెలంగాణల్లో కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
Weather Updates : భానుడి భగ భగలు మార్చి నెలలోనే అధికంగా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వచ్చే రెండు, మూడు నెలలు పరిస్థితి ఏంటని జనం ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ(telangana), ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. దాదాపుగా 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. నిన్నటి ఐఎండీ రిపోర్టు(మార్చి 12) ప్రకారం..అనంతపురంలో 39.7 డిగ్రీలు, కర్నూలులో 39.1, నంద్యాలలో 39.2, కడపలో 37.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అయితే ఆంధ్రప్రదేశ్లోని (andhra pradesh) ఉత్తర కోస్తాలో మాత్రం భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే దక్షిణ కోస్తా, రాయలసీమ, జిల్లాల్లో మాత్రం వాతావరణం పూర్తిగా పొడిగా ఉండనుంది. ఎండల తీవ్రత అధికంగానే ఉండనుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వాతావరణం( Weather) పొడిగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక్కడ వర్షాలు పడే సూచనలు ఏమీ లేవని వెల్లడించింది.