ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్పోరేటర్లకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అద్భుతంగా పోరాడుతున్నారని, ఈ పోరాటం తెలంగాణ నుండే ప్రారంభం కావాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాల్సి ఉందన్నారు. ఈ ఖమ్మ సభ దేశానికి ఓ దిక్సూచీ అవుతుందన్నారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ నుండి ముప్పు పొంచి ఉందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీపై పోరు కోసం కేసీఆర్ అందరినీ ఏకతాటి పైకి తీసుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. కేరళ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. కేసీఆర్‌కు అందరూ అండగా నిలవాలన్నారు. తెలంగాణలో పథకాలు బాగున్నాయని, వీటిని కేరళలో అమలు చేసే ప్రయత్నం చేస్తానన్నారు.
రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు. దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయమని వ్యాఖ్యానించారు. హిందుత్వ సెంటిమెంట్ ద్వారా బీజేపీ అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. మంత్రులు నేరుగా సుప్రీం కోర్టును బెదిరిస్తున్నారని, ఉపరాష్ట్రపతి కూడా అలాగే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కీలక నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించే ప్రయత్నం కేంద్రం చేస్తోందన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని బలవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాగా, ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లతో పాటు పలువురు జాతీయ నాకులు హాజరయ్యారు.