»Pawan Kalyan Should Tell How I Became A Ycp Covert Hariramazogaiah
Hariramazogaiah: వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి
సీనియర్ నేత హరిరామజోగయ్య పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. జనసేన మంచికోసం చెప్తే తననే వైసీపీ కోవర్టు అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే లేఖలు రాసిన ఈయన తనకు సలహాలు ఇవ్వద్దని పవన్ కల్యాణ్ చెప్పిన తరువాత మళ్లీ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Pawan Kalyan should tell how I became a YCP covert: Hariramazogaiah
Hariramazogaiah: ఏపీ రాజకీయాల్లో దుమారం మొదలైంది. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడం పట్ల జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య మాటలు వైరల్‌గా మారాయి. ఇటీవల పవన్‌కు ఆయన లేఖ రాశారు. తాడిపల్లిగూడెంలో జరిగిన జెండా భహిరంగ సభలో భాగంగా తనకు సలహాలు, సూచనలు ఇవ్వకండి అని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్‌గా మాట్లాడారు. తాజాగా ఆయన మాటలపై హరిరామజోగయ్య మరో సారి లేఖ రాశారు. జనసేన క్షేమం కోరి నేను రాసిన సలహాలు, సూచనలు మీకు నచ్చినట్లు లేవని అందులో పేర్కొన్నారు. అంతే నేను వైసీపీ కోవర్టును ఎలా అయ్యానో చెప్పాలన్నారు.
“మొన్నటి సభలో నా పేరు పెట్టి ప్రస్తావించకపోయినా.. ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం చూస్తుంటే నన్ను విమర్శించినట్టే అనిపించింది. నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి. నా అంచనా ప్రకారం జనసేనకు 40 స్థానాల్లో బలమైన అభ్యర్థులున్నారు. అలాంటప్పుడు 24 సీట్లే తీసుకోవడం ఎందుకని ప్రశ్నించాను.. అందుకని వైసీపీ కోవర్ట్ అయ్యానా? మీరు బాగుండాలన్న ఉద్దేశంతోనే బీజేపీని కూడా మీ కూటమిలోకి తీసుకోవాలని సూచించాను.. అందుకని వైసీపీ కోవర్ట్ అయ్యానా?” అని రాసుకొచ్చారు.
“నన్ను వైసీపీ కోవర్ట్ అని అంటున్నవాళ్లంతా జనసేనలోని వారే.. వారంతా టీడీపీ కోవర్టులు కారా? మిమ్మల్ని ఎప్పటినుంచో ప్యాకేజి స్టార్ అంటున్నారు.. ఈ ప్రచారాన్ని చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఒక్కసారైనా ఖండించారా? మీ రాజకీయ జీవితాన్ని నిర్వీర్యం చేయడమే టీడీపీ లక్ష్యం.. తన రాజకీయ లబ్ది కోసం టీడీపీ మిమ్మల్ని నాశనం చేస్తోంది. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను ఓసారి పరిశీలించండి.. మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోండి. జనసేనతో పొత్తు లేకుండా బరిలో దిగితే ఓడిపోతామని చంద్రబాబుకు తెలుసు. అందుకే మీతో కలిశాడు. చంద్రబాబు రేపు ఎన్నికలు అయ్యాక మీకు సముచిత స్థానం ఇస్తాడనుకుంటున్నారా? జనసేనను నిర్వీర్యం చేసి లోకేశ్ ను సీఎం చేస్తాడన్న ఆందోళన జనసైనికుల్లో ఉంది.
నా సలహాలు, సూచనలు మీకు నచ్చినా, నచ్చకపోయినా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం.. చచ్చే వరకు నా వైఖరి ఇలాగే ఉంటుంది. మీకు అధికారంలో తగిన స్థానం కల్పించే వరకు నేను విశ్రమించను” అంటూ హరిరామజోగయ్య తన లేఖలో స్పష్టం చేశారు. జెండా సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు.. జనసేనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా… టీడీపీలా వ్యవస్థాగత బలం ఉందా.. బూత్ లెవెల్లో జనసేనకు బలం ఉందా.. అంటూ ఆయన మాట్లాడారు.