పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పేరును చంద్రసేనగా మార్చుకోవాలని, డబ్బుల కోసం జగన్‌పై, వైసీపీ నాయకులపై ఇంత నీచంగా మాట్లాడుతావా అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనను, అంబటి రాంబాబును, ఇతర వైసీపీ నేతలను ఇష్టం వచ్చినట్లు తిడుతా అంటే ఎలా అని, వారి కులం కాబట్టి మాపై ఆయనకు హక్కు ఉందన్నట్లుగా మాట్లాడుతారా అని నిలదీశారు. తన పేరు తెలియనట్లుగా మంత్రి అంటూ మాట్లాడుతున్నారని, కానీ తన ప్రాంతంలో అందరికీ నా పేరు తెలుసునని చెప్పారు. తన కుటుంబం 60 ఏళ్లుగా రాజకీయం చేస్తోందన్నారు.
మీ నాన్న కానిస్టేబుల్ కాకముందు, నీకు రాజకీయ జన్మను ఇచ్చిన మీ అన్న పునాదిరాళ్లు సినిమా కంటే ముందే మేం రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు. నా కుటుంబం నీలా అమ్ముడు పోలేదన్నారు. నీలా అమ్ముడు పోయే రాజకీయాలకు, ప్యాకేజీలకు తాళాలు కొట్టే రకం మా కుటుంబం కాదన్నారు. మా తాత ఎమ్మెల్యే, నేను, నా తండ్రి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేశారని చెప్పారు. మా గురించి మాట్లాడే హక్కు నీకు ఏమాత్రం లేదన్నారు. ఓ సినిమా డైలాగ్ రాసుకొచ్చి మాట్లాడుతావా, తిట్టడానికి సభ పెట్టడం ఏమిటన్నారు.
తనకు తెలిసింది పోరాటమేనని పవన్ సభలో మొదట చెప్పారని, కానీ చివరకు ఆయన ఆరాటం పొత్తు అని తేలిపోయిందన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం అంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పడానికి ఈ సభ అవసరమా అని ప్రశ్నించారు. సినిమాను 14 రీల్స్ నడపడం ఎందుకన్నారు. సినిమాకు హెడ్డింగ్ ఒకటి, లోపల స్టోరి మరొకటి ఉందన్నారు. స్టోరీకి, డైలాగ్స్‌కు, స్క్రిప్ట్‌కు సంబంధం ఉండదన్నారు. వకీల్ సాబ్ డైలాగ్స్ కొడుతూ, కొత్త సినిమాల డైలాగ్స్ కూడా కలిపితే ఎలా అన్నారు.
పోరాటమే నా జీవితం అంటూ త్రివిక్రమ్ జనసేనానికి డైలాగ్ రాస్తే, ఒంటరి పోరాటం వీరమరణం అంటూ చంద్రబాబు రాస్తాడని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఇక బూతులు నీకు సొంతగా వస్తాయి కాబట్టి ఎవరూ రాయాల్సిన అవసరం లేదన్నారు. పవన్ తీరు రాజకీయ వ్యభిచారంలా ఉందన్నారు. చంద్రబాబు-పవన్ రెండున్నర గంటలు మాట్లాడి నీకెన్ని, నాకెన్ని అని మాట్లాడుకోకుండా దేశం గురించి మాట్లాడుతారా అని మండిపడ్డారు.
పొత్తులో గౌరవం తగ్గకుండా చూస్తానని అంటున్నారని, మరి 10 సీట్లు, 15 సీట్లతో గౌరవం తగ్గకుండా చూస్తారా అని నిలదీశారు. నీకు నా పేరు అంటే తెలియదు.. కనీసం నీ భార్య, పిల్లల పేర్లు చెప్పగలవా అని నిలదీశారు. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి.. మూడు పెళ్లిళ్లు చేసుకోమంటారా అని ధ్వజమెత్తారు. పార్టీ పెట్టిందే చంద్రబాబు పల్లకీ మోయడానికి అని యువతకు చెబుతున్నారా అని నిలదీశారు. గిడుగు రామ్మూర్తి, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు అంటూ పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద డైలాగ్స్ చెబుతున్నారని, కానీ పవన్‌లో ఉన్నది నారావారి నరాలు, పసుపు రక్తం అని ఎద్దేవా చేశారు.
రాజకీయ పార్టీని నడపడం చేతకాదని, జనసేనను చంద్రసేనగా మార్చాలని సూచించారు. డబ్బుల కోసం నీచంగా మాట్లాడుతావా అని నిలదీశారు. సంక్రాంతి పండక్కి వెళ్లి చంద్రబాబు వద్ద మామూలు తీసుకొని మాట్లాడటం ఏమిటన్నారు. నా అంత ధైర్యవంతుడు లేడని చెబుతున్నావని, నువ్వు అంత పోటుగాడివి అయితే ఏం చేశావో చూపించు అని ప్రశ్నించారు. ప్రూవ్ చెయ్ అంటే మరో పెళ్లి, మరో సినిమా చేసి చూపించడం కాదని ఎద్దేవా చేశారు.
PSPK అంటే సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, రాజకీయాల్లో మాత్రం ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ తీసుకోలేదని ఒట్టేసి చెప్పగలవా అని ప్రశ్నించారు. నువ్వు బానిసవు కాకుంటే బాహుబలివా, నీ వెనుక వెళ్లేవారు నిన్ను సైనికుడు అనుకుంటున్నారని, కానీ వారిని గొర్రెల మందను చేస్తున్నావని మండిపడ్డారు. అయినా చాలామంది నీ గురించి తెలుసుకుంటున్నారన్నారు. సభల్లో నేను ఒక కులానికి చెందిన వాడిని కాదని చెబుతావని, లోపల మాత్రం మరోలా ఉంటావని ఆరోపించారు.
వంగవీటి మోహన రంగా చావుకు, ముద్రగడను ఈడ్చిన వ్యక్తికి కాపులను తాకట్టు పెడతావా అని ప్రశ్నించారు. నీలాంటి పొలిటికల్ ప్రాస్టిట్యూట్ దేశంలో లేరు అన్నారు. ఇంత తక్కువ కాలంలో ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నావో చెప్పు అని నిలదీశారు. జెండా, అజెండా, విలువలు లేవన్నారు. సినిమాలో పవన్ హీరో అని, రాజకీయాల్లో మాత్రం జగన్ హీరో, పవన్ విలన్ అన్నారు. ఏదో నీవల్లే చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, కానీ చిరంజీవి వల్లే నీకు అనే విషయం మరిచావా అని నిలదీశారు.