జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. గణతంత్ర దినోత్సవం రోజున పద్ధతిగా మాట్లాడతారు.. పవన్ అలా కాదన్నారు. సెలబ్రిటీ పార్టీ నేత మాత్రం సన్నాసి మాటలు మాట్లాడాడని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పిచ్చెక్కినట్టు మాట్లాడటంతో రియాక్ట్ కావాల్సి వస్తోందని తెలిపారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఓ సామెతను చెప్పారు. పవన్ ఇలాంటి భాష ఉపయోగిస్తూ భావితరాలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.
‘పవన్ వద్ద బాగా డబ్బులు ఉన్నాయని.. అందుకే పెద్ద వాహనం కొనుగోలు చేశాడు. తనను అడ్డుకుంటే కొడతా, ఉగ్రవాదిని అయిపోతా అంటున్నాడు. దమ్ముంటే ఆపాలని అంటున్నాడు. ఆయన ఎవరిని బెదిరిస్తాడు? ఎవరిని కొడతాడు? నిన్నెందుకు ఆపుతాం, నిన్నెందుకు అడ్డుకుంటాం అన్నారు. ఒకవేళ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తమ ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా నిలిస్తే పవన్ కల్యాణ్ ఎందుకు బాధ? అని బొత్స అడిగారు. పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్‌కు తేడా లేదన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారా? ఇలాంటి వాళ్లను చూస్తుంటే రాజకీయాలపై విరక్తి కలుగుతుంది’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.
పవన్ కల్యాణ్ వారాహి ప్రచార రథానికి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. తర్వాత విజయవాడ దుర్గమ్మ వారి చెంత కూడా పూజ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను కలుసుకునేందుకు అందులో పర్యటిస్తున్నారు. తనను ఎవరూ ఆపుతారో అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. వారాహికి ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయలేదు. పలు అభ్యంతరాలు తెలిపింది. వాహనం ఆర్మీ రంగును పోలి ఉంది.. పెద్ద వాహనం అంటూ మెలిక పెట్టింది. తెలంగాణ రవాణా శాఖ మాత్రం రిజిస్ట్రేషన్ చేయించింది. అందుకే సీఎం జగన్ లక్ష్యంగా పవన్ కామెంట్ చేసి ఉంటారు. దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురుదాడి చేశారు.