మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)... పోలీసులు (police) అరెస్ట్ చేసిన పట్టాభి (Pattabhi) కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి భార్య చందన (Chandana), పిల్లలతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)… పోలీసులు (police) అరెస్ట్ చేసిన పట్టాభి (Pattabhi) కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి భార్య చందన (Chandana), పిల్లలతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. తన భర్తను కొట్టారని, ఆయనకు ఏం జరిగినా జగన్, డీజీపీ బాధ్యత వహించాలని అధినేత ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, గన్నవరంలో (Gannavaram) పార్టీ కార్యాలయంపై (party office) దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాను గన్నవరంలోని తమ పార్టీ నేత చిన్నా ఇంటికి వెళ్దామంటే వెళ్ళనివ్వడం లేదని, ఇదేమీ పద్దతి అన్నారు. తాను గన్నవరం ఎయిర్ పోర్టుకు (Air Port) వస్తే వేల మంది పోలీసులను పెడతారా.. పోలీసులు అంటేనే చులకన భావం కలిగే పరిస్థితి వచ్చింది.. అసహ్యం వేస్తోందని దుయ్యబట్టారు. కిందిస్థాయి పోలీసులు బాగానే ఉన్నారని, వారు తమ అధికారులు చెప్పినట్లు నడుచుకుంటారని, కానీ పైస్థాయిలో ఉన్న కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమ పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసేందుకు వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు నిలువరించలేదో చెప్పాలన్నారు. పోలీసులు వారిని అడ్డుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసి పట్టాభి అక్కడకు వెళ్తే అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ఆయనను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచడానికి ముందు హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) విషయంలోను ఇలాగే చేశారన్నారు. జగన్ ది దుష్ట పాలన అని, జైల్లో పెడితే భయపడేది లేదన్నారు. వైసీపీని వదిలే ప్రసక్తి లేదన్నారు. వైసీపీ నేతలతో పాటు తాము కూడా దోషులుగా నిలబడాలని కొందరు పోలీసు అధికారులు భావిస్తే అది వారి ఖర్మ అన్నారు. కానీ దోషులుగా నిలబడే సమయం వస్తుందన్నారు.
సీఐని తూలనాడాడు అంటూ పట్టాభిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెట్టారని, కానీ ఫిర్యాదు చేసిన సీఐ బీసీ అని చెబుతున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టారని, ఇది ప్రభుత్వం కావాలని చేస్తున్నది అన్నారు. ఈ రోజు ఏం చేసినా చెల్లుతుందనుకుంటే పొరపాటు… రేపు అనేది ఉందని మరిచిపోవద్దని హెచ్చరించారు.
పోలీసులపై ఆగ్రహం
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, నియంతృత్వ ప్రభుత్వంలో లేమని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర దేశంలో ఉన్నామన్నారు. తమ వారిని కలుసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుంటే ఎలా అన్నారు. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో నాకు కూడా తెలుసు… తమాషా అనుకోవద్దు అని పోలీసులను హెచ్చరించారు. అమాయకంగా ఉన్నానని అనుకుంటే అది మీ పొరపాటు అని, ప్రతి దానికి హద్దులు ఉంటాయని గుర్తించాలన్నారు. అంతకుముందు చంద్రబాబు హైదరాబాద్ నుండి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన గన్నవరం వస్తాడనే అభిప్రాయంతో ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిపై లారీలు, పోలీస్ వాహనాలతో అడ్డుకున్నారు. ఆయన రామవరప్పాడు రింగ్ రోడు దాటిన తర్వాత వాహనాలను తొలగించారు. పట్టాభి ఇంటికి వెళ్లారు. కానీ గన్నవరంలో పార్టీ నేత చిన్నా ఇంటికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.