TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో మొత్తం 443 అర్జీలు అందాయి. వచ్చిన ప్రతి అర్జీకి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వారి సమస్యలను స్వయంగా స్వీకరించారు.
ELR: కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతుల సంఘం తెలిపారు. రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు, కౌలు రైతులకు రవాణా కిరాయిలు, హమాలీ చార్జీలు పెంచాలన్నారు.
NLR: మెడికల్ మాఫియాను అరికట్టాలని నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సీపీఐ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీలను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైద్యం జరుగుతోందన్నారు. పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్తే వ్యాధి గురించి అడగకుండా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని రోగిని అడిగి వైద్యానికి ఉపక్రమించడం సిగ్గుచేటన్నారు.
SKLM: ఆరోగ్య సబ్ కమిటీలకు ఎఫ్ఎన్హెచ్‌డబ్ల్యూ పై మందస వెలుగు కార్యాలయంలో సోమవారం మండల పీవో పైడి కూర్మారావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యం పై అవగాహన పెంచడం లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కూరగాయలు, ఆకు కూరలు వినియోగించడం ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చన్నారు.
NLR: నెల్లూరులోని ఆర్టీసీ-2 డిపో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఆర్టీసీ-2 డిపోను పినకిల్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ డిపో సెక్రటరీ ప్రసాద్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జనతా వారధి అనే కార్యక్రమాన్ని సోమవారం జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
TPT: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “విలువల విద్యా సదస్సు”లో ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థుల్లో నైతిక విలువల ప్రాధాన్యంపై ఉపన్యసించారు. జీవితంలో ధర్మం, క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఈవో, అధికారులు హాజరయ్యారు.
విశాఖ పోర్టు స్టేడియంలో సోమవారం ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్‌ను ఉత్సాహంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఫిట్‌నెస్ ఉద్యమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో వీపీఏ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యం, సక్రియ జీవనశైలిపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
VZM: రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఇవాళ దర్శించుకున్నారు. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బొబ్బిలి రోడ్డులో వెలసిన ఈ దేవాలయం ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలన్నారు.
AKP: అచ్యుతాపురం మండలం దొప్పర్ల పంచాయతీ తమ్మయ్యపేటలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలోని శ్మశానానికి వెళ్లి చేతి బోరు ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని, మృతదేహాల దహనం సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని వాపోతున్నారు. అధికారులు తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని వారు కోరుతున్నారు.
NDL: అవుకు పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రాజా వీధిలో భూగర్భ డ్రైనేజీ పనుల కారణంగా పైప్లైన్ ధ్వంసం కావడం వల్ల సంత మార్కెట్, చాకలిపేట, ఆర్టీసీ బస్టాండ్ కాలనీల ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం స్థానికులు అధికారులు ట్యాంకర్ల ద్వారా తక్షణ ప్రత్యామ్నాయ సరఫరా అందించాలని కోరుతున్నారు.
విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీగా సీహెచ్ అంబేద్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో సిబ్బంది సమక్షంలో బాధ్యతలు చేపట్టి మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. మహిళల భద్రత, ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
KRNL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 823 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప మీడియాకు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరగలేదని, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. 26,925 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 26,102 మంది హాజరయ్యారన్నారు.
ఏలూరు: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షలకు 17,864 మంది హాజరు కావలసి ఉండగా 16,850 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,014 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని వివరించారు. మొదటిరోజు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు.
W.G: నరసాపురం (M) లక్ష్మణేశ్వరంలో శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ శాఖ భీమవరం డివిజన్ ఇన్‌స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.3,52,089 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్. రామచంద్ర కుమార్, ఆలయ చైర్మన్ తెలిపారు.