సత్యసాయి: మగ్గంపై నేసే వస్త్రాలను మాత్రమే ఆప్కో నుంచి కొనుగోలు చేస్తామని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సహకార సంఘాల సమావేశంలో రూ.1.40 కోట్ల విలువైన మగ్గం వస్త్రాలను అధికారులు అక్కడికక్కడే కొనుగోలు చేశారు. ఆప్కో షోరూమ్‌లలో పవర్ లూమ్ వస్త్రాల విక్రయాలను నిలిపివేసి, నాణ్యమైన చేనేత దుస్తులనే అందుబాటులో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు.
NDL: నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం పెద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని శ్రీశైలం రేంజ్ పెచ్చెర్వు ప్రాంతంలో అడవికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. ఫారెస్ట్ ప్రొటెక్షన్ బైకులు కూడా దెబ్బతిన్నాయి. ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డీడీ విగ్నేష్ అప్పావ్ దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
CTR: రొంపిచర్ల మండలంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. చెంచమరెడ్డిగారి పల్లి గ్రామపంచాయతీ, బుసిరెడ్డిగారిపల్లిలో ప్రజలతో మమేకం అయ్యారు. పెద్దమల్లెల గ్రామపంచాయతీలో సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాను అని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్సీ భవనంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు జెడ్పీ సీఈవో శివశంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దిశ’ చైర్మన్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నాలుగో త్రైమాసిక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.
VZM: గజపతినగరం మండలం మరుపల్లి NH పై ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద మానాపురానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.
SKLM: సారవకోట మండలం పెద్దలంబ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 10న ఐదో తరగతి విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హెచ్ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్న విజేతలకు జ్ఞాపికలతోపాటు నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు 6281368168ను సంప్రదించాలన్నారు.
నెల్లూరు రూరల్ ములుమూడి గ్రామంలో అమ్మవారి ఆలయంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అమ్మవారి రెండు మంగళసూత్రాలు, ఆరు కాసులు, వెండి కిరీటం, వెండి శఠ గోపం చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ పూజారి రవితేజ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
PLD: మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన పులిచింతల ముంపు బాధితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద రూ. 6 కోట్లు విడుదల చేయాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సీఎం చంద్రబాబును కోరారు. గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, గురజాల నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు.
ఎన్టీఆర్: నందిగామ వై జంక్షన్ వద్ద ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు భారీగా జరిమానాలు విధించారు. సీఐ వైవీఎల్ నాయుడు మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.
KKD: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 28 మంది మృతి చెందారని ఎస్పీ బిందుమాధవ్ ధ్రువీకరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరారీలో ఉన్న కేంద్రం నిర్వాహకులు అడబాల నాని, అర్జున్‌లను రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. లైసెన్సులతో పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నామని, వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ గురువారం అమరావతిలో CM చంద్రబాబును కలిశారు. జిల్లాలోని గ్రంథాలయాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రితో చర్చించారు. మండల కేంద్రాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, పోటీ పరీక్షల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నూతన భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విన్నవించారు.
సత్యసాయి: కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం సాయంత్రం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా వాహన సేవను నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు 15 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
GNTR: నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డిస్‌ప్లే ఫీజులు చెల్లించని బోర్డులను తొలగించాలని కమిషనర్ మయూర్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో రూ. 7 కోట్లకు పైగా బకాయిలు ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిదారుల వివరాలను సేకరించి, బోర్డులను తొలగించేందుకు తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
NLR: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు.
BPT: జిల్లాలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గురువారం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 3 వేల మందితో, ప్రతి నియోజకవర్గంలో 500 మందితో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వేడుకల్లో భాగంగా వివిధ శాఖల స్టాల్స్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.