ASR: వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి కాకరపాడు గ్రామంలోని జంక్షన్ వద్ద రహదారి నిబంధనలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
BPT: ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని లబ్ధిదారులు తమ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
CTR: రాష్ట్రంలో అర్హత గల నిరుపేదలకు టిడ్కో గృహాలు, పక్కా ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామా నాయుడు మంగళవారం డిమాండ్ చేశారు. ఇందుకోసం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈనెల 24న ధర్నా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
AKP: సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటనపై టీడీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు పార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం పాయకరావుపేట పట్టణంలో ప్రతి షాపుకు వెళ్లి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
PPM: గరుగుబిల్లి మండలం గిజబ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం సాయంత్రం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
NLR: బుచ్చి పట్టణం ఖాజానగర్‌లోని ఏడవ వార్డులో మైనార్టీ యువత పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 50 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి రంజాన్ తోఫాను అందజేశారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేదవారికి ఈ తుఫాను అందజేసినట్లు వారు తెలిపారు.
VSP: జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ అందుబాటులో ఉందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మార్చి 31లోగా పన్నులు ఒకేసారి చెల్లిస్తే ఈ సదుపాయం పొందవచ్చన్నారు. వార్డు సచివాలయాలు, బ్యాంకులు, జీవీఎంసీ కార్యాలయాల్లో చెల్లింపులు చేయవచ్చని సూచించారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కోనసీమ: మున్సిపాలిటీ పరిధిలో చెల్లించాల్సిన ఇంటి పన్నులు, ఖాళీ స్థల పన్నుల బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయం కల్పించినట్లు మండపేట కమిషనర్ టీవీ రంగారావు మంగళవారం తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆదేశాల మేరకు ఈ రాయితీ అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. బకాయి పన్నులను ఒకేసారి చెల్లించే పన్ను దారులకు ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు.
ATP: పామిడి(మం) ఎద్దులపల్లిలో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 18 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల ప్రజలకు హెచ్చరించారు.
ELR: వేలేరుపాడు మండలం జిన్నెలగూడెంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. తురసం రవి, లక్ష్మీ దంపతుల రెండేళ్ల కుమారుడు ధనుష్ ఇంట్లో నిద్రిస్తుండగా త్రాచుపాము కరిచింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు సంతానంలో కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
KDP: గంజాయి రహిత జిల్లాగా అందరం కలిసికట్టుగా తీర్చిదిద్దుదామని బి.మఠం ఎస్సై శివప్రసాద్ తెలిపారు. డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా DYFI ఆధ్వర్యంలో జన చైతన్య జీపు జాతా బి.మఠంకు చేరుకుంది. జిల్లా ఉపాధ్యక్షులు గండి. సునీల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DYFI రాష్ట్ర కార్యదర్శి రామన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని, శివకుమార్‌లు పాల్గొన్నారు.
NDL: పాములపాడు గ్రామానికి చెందిన బోయ అమర్ (28) గడ్డి మందు తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అమర్ మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోవడంతో భార్య మందలించింది. ఈ నెల 14న ఇద్దరు గొడవపడి గడ్డి మందు త్రాగాడు కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.
W.G: ఆకివీడు అన్వర్ మసీదులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు పాల్గొన్నారు. విశ్వాసాలు వేరైనా ప్రజలందరూ అన్నదమ్ముల్లా ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అల్లా అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థించారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
అన్నమయ్య: స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధిలో ముందుండాలని ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ దినకర్ అన్నారు. సమీక్షలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాల పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీఎం ధన ధాన్య కృషి యోజనతో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, మదనపల్లి టమోటోకు విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు పై దృష్టి పెట్టాలని సూచించారు.
VZM: ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న 550 సైలెన్సర్లను స్థానిక ట్యాంక్ బండ్ రోడ్డులో మంగళవారం రోడ్డు రోలరుతో ధ్వంసం చేశారు. ఒక్కో వాహనదారుకు రూ.1500 జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.