SKLM: పోలాకి, గార నడుమ వంశధార నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు నిలిచిపోయాయి.తీరప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు2018లో రూ.72కోట్లతో అప్పటి నేటి టీడీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.17 పిల్లర్ల నిర్మాణం కూడా పూర్తయింది. నేటికీ ఏడు సంవత్సరాలకు పైగా అయినా పనులు ముందుకు సాగకపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
PLD: బొల్లాపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బోడిపాలెం తండాతో పాటు పలు గ్రామాల సరిహద్దుల్లోని అడవుల్లో ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారేమోనని గాలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ.. అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నట్లు ఎవరికైనా ఆ సమాచారం తెలిసినా సమాచారం ఇవ్వాలన్నారు.
W.G: దసరా ఉత్సవాల్లో భాగంగా గోరింటాడలో కొలువై ఉన్న శ్రీ దేశాలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్లకు ఇవాళ మట్టి గాజులతో ప్రత్యేకాలంకరణ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి గాజులు, ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
VSP: ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో విశాఖ ఆర్టీసీ రీజియన్‌లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం, ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 22 వరకు బస్సుల్లో ప్రయాణించిన వారిలో 75 శాతం మంది మహిళలే ఉన్నారు. గతంలో పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉండగా, ఇప్పుడు రోజుకు సగటున 3.07 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ ప్రజలు ఏడాది కాలంగా పందుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో పందులు గుంపులుగా తిరుగుతూ ప్రజల జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయని.. ఈ సమస్యను సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించిన ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఊరికి దూరంగా పందులను తరలించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
SKLM: వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తున్నాయి
W.G: రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు బండిముత్యాలమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారని, అనంతరం పేరుపాలెం నార్త్ శివాలయంలో స్వామిని దర్శించుకుంటారని అన్నారు. తర్వాత పీఎం లంక గ్రామాన్ని పరిశీలిస్తారని నాయకర్ తెలిపారు.
NLR: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల శాఖలకు చెందిన సంక్షేమ హాస్టళ్ల పనితీరు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై సమీక్షించారు.
E.G: పెరవలి మండలం తీపర్రులో ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. తణుకు డిపోనకు చెందిన బస్సు రాజమండ్రి వెళ్తుండగా, అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సలాది సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
SKLM: దసరా నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. బుధవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకుంటారని ఆలయ అర్చకులు సంతోశ్ కుమార్, రాజేశ్ తెలిపారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు.
తిరుపతి: తిరుమల శ్రీవారిని నిన్న 63,837 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా ఆలయానికి రూ.2.85 కోట్లు ఆదాయం సమకూరింది. క్యూలైన్లు సాధారణంగా ఉన్నాయని, ఎక్కువ సమయం పట్టడంలేదని భక్తులు నేరుగా దర్శనానికి వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
NDL: రుద్రవరం మండలం పేరూరు గ్రామ సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న సరస్వతి బాయి మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్హత్యయత్నానికి పాల్పడింది. p4 సర్వే రీ తదితర పనుల్లో అధికారుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె భర్త తిరపాల్ నాయక్ తెలిపారు. ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లిలో ఐదేళ్లుగా పనిచేసిన ఆమె ఇటీవలే రుద్రవరం మండలం పేరూరుకు బదిలీ అయ్యారు.
VZM: టీడీపీ మాజీ మండల శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ, మరుపల్లి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గెద్ద రవి(59) బుధవారం ఉదయం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. మూడు రోజుల కిందట రవి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. రవి మృతి పట్ల పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
KDP: సిద్ధవటం మండలం జ్యోతి గొల్లపల్లి ఎస్సీ కాలనీ గ్రామానికి చెందిన పశువుల కాపరి కూరాకు బాబు మంగళవారం ఉదయం పశువుల మేపుకొరకై అటవీ ప్రాంతంలోకి వెళ్లి కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు అడివంతా గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తెలిస్తే తెలపాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ప్రకాశం: పామూరు మండలంలోని కంబాలదిన్నెలో ‘స్వస్థనారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని వైద్యులు గద్దె ఏడుకొండల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 75 మందికి జ్వరం, థైరాయిడ్, షుగర్ పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. డాక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేసే ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొనాలని అన్నారు.