చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ నాయకులకే లోకేష్ పాదయాత్ర అంటే భయంగా ఉన్నట్లు ఉందన్న రోజా లోకేష్ అడుగు పెడితే పార్టీ పరిస్థితి 23 స్థానాల నుంచి దిగజారుతుందని టీడీపీ నాయకులకు భయంగా ఉందని అన్నారు.
లోకేష్ పాదయాత్ర పోస్టర్ లో చంద్రబాబు ఫోటో కూడా లేదని, లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం కాదు… లోకేష్ ఫిట్ నెస్ కోసమేనని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఆపాల్సిన పని తమకు లేదన్నారు మంత్రి. లోకేష్ సన్నబడ్డం కోసమే పాదయాత్ర చేస్తున్నారని.. ఆయన పాదయాత్ర చేస్తే ఆ పార్టీకే నష్టం అన్నారు. ఇక శాసన మండలిలో లోకేష్ అడుగు పెట్టగానే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయని పాదయాత్ర పోస్టర్ విడుదల చేయగానే 8 మంది చనిపోయారని ఆమె విమర్శించారు.
చంద్రబాబు ఇరుకు రోడ్డుల్లో సభలు పెట్టి జనాన్ని చంపేస్తున్నారని మండిపడ్డారు మంత్రి. పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అన్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు 40 మందిని చంపారని ధ్వజమెత్తారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని.. 11 మంది బలయ్యారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు.