జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కారణంగా కాపు సమాజిక వర్గానికి అన్యాయం జరుుగుతోందని… వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu satyanarayana) ఆరోపించారు. తమ పార్టీలోని కాపు వర్గీయులను పవన్ కించపరిచే విధంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే కాపునేతలందరితో కలిసి చర్చిస్తామని వారు చెప్పారు.
చంద్రబాబు పార్టీని బతికించేందుకు పవన్ ప్యాకేజీ తీసుకుని పని చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కాపులు పవన్‌తో వుండి వుంటే కాపులు ఎక్కువగా వుండే రెండు చోట్ల ఎందుకు ఓటమి ఎదుర్కొంటారని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ కాపు నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.
ఈనెల 31న రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.
వైసీపీలో ఉన్న కాపు నేతలపై ఇటీవలే జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు కులం వైసీపీ కాపు నేతల దగ్గర లేదని, తన దగ్గర ఉందని పవన్ అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైసీపీలో ఉన్న కాపు నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తీరుపై ఎలా స్పందించాలి? పవన్ కళ్యాణ్‌ను ఎలా కట్టడి చేయాలి? అనే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.