తన గొంతు ఆగాలంటే తనను ఎన్కౌంటర్ చేయడం ఒక్కటే పరిష్కారమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టుకు రంగం సిద్ధమంటూ లీకులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్లాలని చూస్తారని, కానీ తాను మాత్రం అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. చివరి వరకు పార్టీలో ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేయడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. అలా చేస్తే మోసం అవుతుందన్నారు. తాను రాజకీయాల్లోకి కొత్తగా రాలేదని, విద్యార్థి నేతగా మొదలు 35 ఏళ్ళుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేశారు. అధికారం కోసమే అయితే గతంలోనే టీడీపీలో చేరేవాడినని చెప్పారు. తన బిడ్డల గురించి విమర్శలు సరికాదన్నారు.
తాను ఎంతో ప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలోనే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురిందంటే తాను ఎలా జీర్ణించుకోగలనని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పైన ఆధారాలు చూపించిన తర్వాతనే తాను మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు తాను ఎప్పుడు మోసం చేయలేదని, నెల ముందు వరకు కూడా తనకు పార్టీకి దూరం జరిగే ఆలోచన లేదన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ ఆధారం దొరికిన తర్వాత దూరం జరగక తప్పలేదని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో ఎన్నికల సమయంలో తెలుస్తుందని చెప్పారు. పదిమంది మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు తనపై ఎలా మాట్లాడారో అందరికీ తెలుసునని చెప్పారు.
అందుకే వారికి సమాధానం చెప్పడానికి తన వద్ద ఉన్న ఆధారాలను బయట పెట్టినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరిపించాలని తాను కోరానని, అయితే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేను అయిన తాను ఆరోపణలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు విచారణ కోసం లేఖ రాసి ఉంటే ప్రజలకు పారదర్శకత అర్థమయ్యేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ సరికాదని, అదీ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. తనను అరెస్ట్ చేస్తారంటూ లీకులు ఇస్తున్నారని, ఏ నిమిషమైనా అరెస్టు చేసి, శాశ్వతంగా జైల్లో పెట్టుకోవచ్చునని చెప్పారు. తనపై కేసులు పెట్టి పెట్టి మీరు అలసిపోతారు తప్పితే, నా గొంతు ఆగేది లేదన్నారు. అయితే నా గొంతు ఆగాలంటే మాత్రం ఎన్ కౌంటర్ చేయాలన్నారు.