తమ అక్రమాన్ని సక్రమమని చెప్పేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు, కందుకూరులలో జరిగిన ప్రమాదాలు ప్రభుత్వ తప్పిదంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా కేక్ కట్ చేసి, వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తన సభలలో చంపిన వారిని పవన్ కళ్యాణ్ పరామర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలవడాన్ని వామపక్షాలు స్వాగతించడం ఆశ్చర్యకరానికి గురి చేసిందన్నారు. ఈ కూటమిలో బీజేపీ కూడా కలిస్తే వామపక్షాలు ఏమంటాయని ఎద్దేవా చేశారు. ఎరుపు, కాషాయం కలిసి పసుపుగా మారుతాయేమోనని చురకలు అంటించారు. చంద్రబాబు ఎంతమందితో కలిసి వచ్చినా తమకు అభ్యంతరం లేదని, పందికొక్కులు, ఎలుకలు అన్నీ కలిసి వస్తే ఎవరి విలువ ఏమిటో తెలుస్తుందన్నారు. ఓ వైపు గుంట నక్కలు, మరోవైపు జగన్ ఉన్నారన్నారు. అప్పుడు అందరినీ ఒకేసారి ఓడించే ఛాన్స్ జగన్‌కు వస్తుందని చెప్పారు. ఎవరు ఎన్ని పగటి వేశాలు వేసినా, పగటి కలలు కన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు లేవన్నారు.
ఇదే సమయంలో ఆయన ముందస్తుపై కూడా స్పందించారు. ఇటీవల ఏపీలో జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లేది లేదని, అలాంటి ఉద్దేశ్యమే తమకు లేదని స్పష్టం చేశారు సజ్జల. ప్రజా తీర్పు ప్రకారం తాము అయిదేళ్లు పూర్తిగా పాలన చేస్తామన్నారు. ప్రతిపక్షాలను ప్రజలు అంగీకరించడం లేదని, అయితే తాము సజీవంగా ఉన్నామని చెప్పడానికే ముందస్తు అనే వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. బలమైన జగన్‌ను ఎదుర్కోవడానికి విపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయన్నారు. కానీ వారి కోరిక నెరవేరదన్నారు. చంద్రబాబు, పవన్ ఏ విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో ప్రజలకు తెలిసిపోయిందన్నారు.