క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ఈ అవార్డులను నా జీవితంలోని మహిళలకు అందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తన తల్లి, వదిన, భార్యను గుర్తు చేసుకున్నారు.
మా అమ్మ రాజనందిని పాఠశాల విద్య కంటే తనను కామిక్స్, స్టోరీ పుస్తకాలు ఎక్కువ చదివేలా ప్రోత్సహించిందని, నాలో సృజనాత్మకతను ప్రోత్సహించేలా చేసిందని గుర్తు చేసుకున్నారు. అలాగే తన వదిన శ్రీవల్లి ఎప్పుడూ కూడా నేను జీవితంలో మెరుగ్గా ఉండాలని కోరుకునే వారన్నారు. తన జీవిత భాగస్వామి రమ, తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసినప్పటికీ, తన జీవితానికి ఆమె డిజైనర్ అన్నారు. ఆమె లేకపోతే తాను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించారు. నా కుమార్తెలు ఏమీ చేయక్కర్లేదు… వారి చిరునవ్వు చాలు నా జీవితాన్ని వెలిగిస్తుందన్నారు. మేరా భారత్ మహాన్ అంటూ ప్రసంగం ముగించారు.
రాజమౌళి చేసిన ప్రసంగం భారతీయతను తలపించింది. నమస్కారం అంటూ సంప్రదాయంగా ప్రారంభించి, భారతీయత గౌరవించుకునే మహిళనే తన విజయం వెనుక ఉందని చెప్పడంతో పాటు, చివరలో భారత్‌ను గుర్తు చేసుకొని, మేరా భారత్ మహాన్ అంటూ నినదించడం అందరి మనసులను గెలుచుకుంది.
రాజమౌళి ప్రసంగం వీడియోను నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
అమెరికా సహా చాలా ప్రాంతాల్లో భారతీయులు సంపాదిస్తూ, విజయవంతమైన కమ్యూనిటీగా ఉందని, ఏమీలేని స్థితి నుండి దీనిని ఎలా సాధించామా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారని, కానీ ఇందులో చాలా వరకు మన బలమైన కుటుంబ వ్యవస్థ నుండే వస్తోందని కంగనా పేర్కొన్నారు. మనం ఎంతో భావోద్వేగపరమైన, ఆర్థిక, మానసిక మద్దతును మన కుటుంబాల నుండి పొందుతుంటామని, మహిళల వల్ల కుటుంబాలు ఏర్పాటు అవుతాయని, కుటుంబాలను వారే పోషిస్తూ కలిపి ఉంచుతారని పేర్కొన్నారు. రాజమౌళి ప్రసంగం పట్ల నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.