అనంతపురంలో టీడీపీ, వైసీపీ ముఖ్య నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిని టీడీపీ ముఖ్య నేత కాల్వ శ్రీనివాసులు టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ఇసుక మాఫియా, మద్యం సప్లై, ఆయుధాల సరఫరా, నకిలీ నోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని రాయదుర్గం నియోజకవర్గంలో గల ఉద్దేహాల్ నుంచి తిమ్మలాపురం వరకు పాదయాత్రకు దిగారు. ఇంటి వెనక నుంచి వెళ్లి పాదయాత్ర చేపట్టాలని అనుకున్న పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే పర్మిషన్ తీసుకున్నానని కాల్వ శ్రీనివాసులు చెబుతున్నారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు.
పాదయాత్రకు అనుమతి లేదని కాల్వ శ్రీనివాసులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో రాయదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంటి వెనక గోడ దూకి నేతాజీ రోడ్డుపైకి వెళ్లిన నో యూజ్.. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి కాల్వ శ్రీనివాసులు అక్కడే బైఠాయించారు. కాపు రామచంద్రారెడ్డి అక్రమాలను బహిర్గతం చేయకుండా ఆంక్షలు విధించారని మండిపడ్డారు. పాదయాత్ర గురించి ఈ నెల 6వ తేదీన బొమ్మనహాళ్ పోలీసులకు సమాచారం ఇచ్చామని కూడా గుర్తుచేశారు. పోలీసులు మాత్రం తమ పట్ల వివక్ష చూపారని ఆరోపించారు. వైసీపీ నేతల ఇసుక అక్రమ దందా వల్ల పలు గ్రామాల్లో 850 బోర్లు అడుగంటిపోయాయని గుర్తుచేశారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని వివరించారు. అయినప్పటికీ ఉన్నతాధికారి స్పందించలేదని చెప్పారు. పోలీసుల తీరును నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని, ఇంటికి తరలించారు.
రాయదుర్గం అసెంబ్లీ నుంచి ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో కాల్వ శ్రీనివాసులు రామచంద్రారెడ్డిని ఓడించారు. వీరిద్దరు ప్రత్యర్థులుగా రెండుసార్లు బరిలోకి దిగారు. కాపు రామచంద్రారెడ్డి ప్రభుత్వ విప్.. అయితే ఇటీవల అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. ఆయన అల్లుడు మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తాను బాధలో ఉన్నానని, జిల్లా వ్యవహారాలు చూడలేనని సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దాంతోపాటు రాయదుర్గం నియోజకవర్గానికి సమయం కేటాయించాలని కూడా అందులో ప్రస్తావించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున, నియోజకవర్గంపై ఫోకస్ చేస్తానని తెలిపారు.
వైసీపీ నేత, పీఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ మహేశ్వరరెడ్డితో కాపు రామచంద్రారెడ్డి వియ్యం అందుకున్నారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం పంచాయతీ పరిధిలో గల పప్పిరెడ్డిపల్లె మహేశ్వరరెడ్డి స్వగ్రామం. మహేశ్వరరెడ్డి కుమారుడు మంజునాథరెడ్డి కాగా, నాలుగేళ్ల క్రితం కాపు రామచంద్రారెడ్డి కుమార్తె స్రవంతితో పెళ్లయ్యింది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ నుంచి కాపు రామచంద్రారెడ్డి తప్పుకున్నారు. కానీ కాల్వ శ్రీనివాసులు మాత్రం ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని పాదయాత్రకు దిగగా.. పోలీసులు గృహ నిర్బంధం చేశారు.