ఏపీలో పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో జనసేన, బీజేపీ కూడా సర్కార్‌ను దుమ్మెత్తి పోస్తోంది. ఇటీవల చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కలువడంపై వైసీపీ శ్రేణులు, మంత్రులు కూడా స్పందించారు. పలు విధాలుగా కామెంట్ కూడా చేశారు. దీనిని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తప్పుపట్టారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయితే తప్పు ఏంటీ అని అడిగారు. కావాలనే ఇంత ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యేలు, నేతలే కాక.. మంత్రులు కూడా స్పందించడం ఏంటో అని ఫైరయ్యారు.
12 మంది మంత్రులు బాబు- పవన్ భేటీ గురించి స్పందించారు. ఆ మంత్రులు ఏనాడైనా తమ శాఖల పురోగతిపై స్పందించారా అని సత్యప్రసాద్ అడిగారు. కానీ విపక్షాలకు చెందిన నేతలు కలిస్తే మాత్రం ప్రెస్ మీట్ పెట్టేందుకు వెనకాడబోరని అంటున్నారు. సమయం మొత్తం వారిని విమర్శించడానికే కేటాయించారని ఫైరయ్యారు. చంద్రబాబు, పవన్ కాఫీకి కలిస్తే 12 మంది మంత్రులు స్పందించారని, ఇక వారిద్దరూ కలిసి భోజనం చేస్తే మంత్రులు ఏమైపోతారో అని కామెంట్ చేశారు. అంతేకాదు ఒకడుగు ముందుకు వేసి.. చంద్రబాబు, పవన్ కలవకూడదని జీవో నెం.2 తీసుకువస్తారేమో అని అనగాని సత్యప్రసాద్ సెటైర్లు వేశారు. ఇటీవల జగన్ సర్కార్ జీవో నంబర్ 1 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదీ రహదారిపై సభలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించేందుకు తీసుకొచ్చారు. మరీ జీవో నంబర్-2 అని బాబు- పవన్ కలువకుండా చేస్తారెమో అని విరుచుకుపడ్డారు.
హైదరాబాద్‌లో నిన్న (ఆదివారం) చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ వచ్చారు. రెండున్నర గంటల పాటు జీవో నెం.1, ఇతర అంశాలపై చర్చించుకున్నారు. సమావేశంపై వైసీపీ మంత్రులు ధ్వజమెత్తారు. దీనిని సత్యప్రసాద్ ఖండించారు. ఇదీ కరెక్ట్ కాదని, మంత్రులు తమ పని తాము చేసుకోవాలని కోరారు. బాబు, పవన్ లక్ష్యంగా కామెంట్స్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. వీకెండ్ పొలిటిషీయన్ అని అంటున్నారు. దీనిపై జనసేన నుంచి అదేస్థాయిలో కౌంటర్ అటాక్ వస్తోంది. చంద్రబాబు, లోకేష్‌ను వైసీపీ నేతలు కామెంట్ చేయగా, తెలుగు తమ్ముళ్లు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికకు ఇంకా సమయం ఉంది. ఏడాదిన్నర టైమ్ ఉన్నా.. ఇప్పటినుంచే హడావిడి నెలకొంది. జగన్ కూడా ముందస్తుకు వెళతారని ప్రచారం జరుగుతుంది. కరెంట్ కోతలు, డెవలప్ మెంట్ లేకపోవడం ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. మద్య నిషేధం అని చెప్పి.. పూర్తిగా అమలు చేయకపోవడం శాపంగా మారుతుంది. మూడున్నరేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు కందుకూరులో సభ పెట్టినా, గుంటూరులో చంద్రన్న కానుక పేరుతో చీరల పంపిణీ చేసినా.. జనం నుంచి రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే రెండు ఘటనలతో కలిపి 11 మంది చనిపోవడం మాత్రం ఇబ్బందిని కలిగించింది. ఆ అంశాన్ని ప్రభుత్వం- ప్రతిపక్షం ఒకరిపై మరొకరు నిందలు వేసుకున్నారు. కానీ అమాయక జనం మాత్రం చనిపోయి.. కుటుంబాలకు కడుపుకోత మిగిల్చారు.