»Investigation Of Cm Jagans Illegal Assets Case Supreme Notices To Cbi
CBI : సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ.. సీబీఐకి సుప్రీం నోటీసులు
ఏపీ సీఎం జగన్‌పై ఉన్న కేసుల విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ( CM YS Jaganmohan Reddy) సుప్రీంకోర్టులో (Supreme Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు సీబీఐకి (CBI) కూడా ఉన్నతన్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjeev Khanna), జస్టిస్ ఎస్వీఎన్ భట్టి (Justice SVN Bhatti) ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా జగన్ అక్రమాస్తుల కేసులో విపరీతమైన జాప్యం ఎందుకు జరగుతుందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ సుప్రీం నోటీసులు జారీ చేసింది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని ఎంపీ రఘురామ (MP Raghuram Krishna Raju) సుప్రీంలో పిటీషన్ వేశారు. తెలంగాణ సీబీఐ కోర్టులో (Telangana CBI Court) జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల కొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.