Weather Update: ఏపీకి ఐఎండీ హెచ్చరిక..మరో 24 గంటల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తాయని, మరో 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఉదయం 6 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కొన్ని జిల్లాల్లో రాత్రి సమయాల్లో మరింత చల్లటి వాతావరణం (Weather) నెలకొంటోంది. పగలు ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ సాయంత్రం అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ప్రకాశం జిల్లా పొదిలి, ఏలూరు, పోలవరం, పల్నాడు జిల్లా, పాలకోడేరు, నర్సాపురంలో భారీ వర్షాలు కురవడంతో అక్కడివారు ఉక్కపోతల నుంచి కాస్త ఉపశమనం పొందారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో తేమతో కూడిన గాలులు (Heavy Winds) ఎక్కువగా వీస్తాయని వెల్లడించింది. మరోవైపు తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుంటంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.