ఏపీలో మూడు రాజధానుల అంశం పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. మరోవైపు రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలయింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా చూడాలని ఆ కమిటీ సూచించింది. ఈ క్రమంలో మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణను చేపట్టనుంది. రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే విషయంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆరు నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం, మరో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ వాదనలను వినిపించనున్నారు.