ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస మండలం మందడిలో మహిళా కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఉపాధి హామీ కూలీలు పనులు చేసుకుంటుండగా లారీ దూసుకురావడంతో ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఉపాధి కూలీలు ప్రమాదబారిన పడి మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటనా స్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలు అందర్నీ కంటతడి పెట్టించాయి. ఉపాధి హామీ పనులు చేయడానికి ఇంటి నుంచి వెళ్లినవారు విగతజీవులుగా మారడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.