Eco Consultancy Owner Haribabu: నకిలీ ధృవపత్రాలతో విదేశాలకు పంపిస్తోన్న ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఓనర్ హరిబాబును (Owner Haribabu) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ యువకుడు అమెరికా వెళ్లేందుకు ఆప్లై చేసుకున్నాడు. ధృవపత్రాలు పరిశీలించగా.. నకిలీ అని తేలింది. దాంతో కన్సల్టెన్సీ నిర్వహకుడు హరిబాబును నరసరావు పేట పోలీసులు అరెస్ట్ చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఉంది. ఈ కన్సల్టెన్సీ చాలా మందిని విదేశాలకు పంపించింది. కొందరు వెళ్లగా ఇబ్బంది ఎదురుకాలేదు. టీవల పల్నాడు జిల్లాకు చెందిన హేమంత్ (hemanth) అమెరికా వెళ్లేందుకు ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. చెన్నైలో గల యూఎస్ కాన్సులేట్‌లో 16వ తేదీన ఇంటర్వ్యూ జరిగింది. హేమంత్ డాక్యుమెంట్స్‌ను కాన్సులేట్ అధికారులు పరిశీలించారు. ఆ డాక్యుమెంట్స్ ఫేక్ అని తేలింది.
హేమంత్పై కాన్సులేట్ అధికారులు చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా.. ఆ పత్రాలు కన్సల్టెన్సీ ఓనర్ హరిబాబు ఇచ్చాడని తేలింది. నకిలీ పత్రాలు ఇచ్చిన హరిబాబును అరెస్ట్ చేశారు. హేమంత్ మాదిరిగా మరికొందరికీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటిపై కూడా విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని చూసే యువతకు నకిలీ సర్టిఫికెట్లను కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు అంట గడుతున్నాయి. వారి నుంచి అందినకాడిని దోచుకుంటున్నాయి. ఇంటర్వ్యూలో దొరికితే పట్టుబడుతున్నారు. లేదంటే ఫారిన్ వెళుతున్నారు. విదేశాలకు వెళ్లిన వారు కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చెబుతున్నారు. ఇకనైనా ఫేక్ కన్సల్టెన్సీలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.