విజయవాడ (Vijayawada)ఇంద్రకీలాద్రిపై కొలువైన దర్గమ్మ నేడు రెండు రూపాల్లో భక్తులకు దర్శనమిన్నారు. నిన్న దుర్గాదేవి (Durgadevi) అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు ఉదయం నుంచి మహిషాసురమర్దనిగా కనిపిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. సోమవారంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు. చివరి రోజు కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
అందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలు (Dussehra celebrations) ముగుస్తుండడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది. దసరా ముగిసిన తర్వాత కూడా రెండు రోజుల పాటు భవానీలు తరలిరానున్నారు. ఇంద్రకీలాద్రి(Indrakiladri)పై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో కొండ కిక్కిరిసిపోయింది. మరోవైపు, భవానీ మాలధారులతో ఇంద్రకీలాద్రి కుంకుమవర్ణంతో నిగారిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.