ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. జగన్ అభద్రతాభావంతో ఉన్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్యకేసులో కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తీసుకువస్తోందని తెలిపారు. ఈ అంశం నుంచి దృష్టి మరల్చేందుకే విశాఖ రాజధాని వ్యవహారం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా సీఎం జగన్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జగన్ పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని కోరారు. బాబాయ్ హత్యకేసులో ముద్దాయిలను కాపాడేందుకు ఢిల్లీలో జగన్ పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణం అవనుందని సీఎం జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఇదే అంశాన్ని ఉమ ప్రస్తావించారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందనే భయం జగన్‌కు పట్టుకుందన్నారు. అందుకోసమే విశాఖ పరిపాలన రాజధాని అని, తాను కూడా షిప్ట్ అవుతానని ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నల వర్షం కురిపించారు. అవినాష్ కాల్ రికార్డులను పరిశీలించగా నవీన్‌తో ఎక్కువ మాట్లాడినట్టు గుర్తించారు. నవీన్.. సీఎం జగన్ భార్య భారతి పీఏ అని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నవీన్ పాత్రపై సీబీఐ అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నోటీసులు జారీచేశారు. విచారణ స్పీడ్ అందుకుంది.