ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను అరెస్ట చేసిన సీఐడి రిమాండ్ రిపోర్టులో సంచలన అభియోగాలు చేసింది. ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) లో హాజరుపరిచారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) లో చంద్రబాబు పేరు లేకపోవడంతో, కొద్దిసేపటి క్రితమే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏసీబీ కోర్టు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
కోర్టు పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎంపీ కేశినేని నాని(MP Keshineni Nani), సోమిరెడ్డి, జవహర్ సహా టీడీపీ నేతలను పోలీసులు అనుమతించడం లేదు. చంద్రబాబు తీరుపై సైతం సీఐడీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి .కోర్టుకు వెళ్లే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని సీఐడీ తెలిపింది. 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలనే నియమాన్ని జాప్యం చేసేందుకు చంద్రబాబు యత్నించారని సీఐడీ తెలిపింది.
అంతకుముందు, విచారణ ప్రారంభం సమయంలో తన చాంబర్ లో విచారిస్తానని న్యాయమూర్తి(Judge) సూచించగా, ఓపెన్ కోర్టు విచారణ జరగాలని టీడీపీ(TDP) న్యాయవాదుల బృందం కోరింది. దాంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరు మీద కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించింది. మొత్తం రూ.371 కోట్ల మేర కుంభ కోణం జరిగిందని సీఐడీ అభియోగం మోపింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు చంద్రబాబును 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ (Remand) ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది