అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కేసులో సీఐడీ అధికారులు (CID officials) దూకుడు పెంచారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్న మాజీ మంత్రి నారాయణకు వాట్సప్‌లో నోటీసులు పంపారు. ఈ నెల 4న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అదే రోజున నారా లోకేశ్‌ను కూడా విచారించనున్న విషయం తెలిసిందే.మరోవైపు ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్(Nara Lokesh)కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ14గా సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
అమరావతి (Amaravati) రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. ఈ కేసు విషయాని వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను మార్చారని వైసీపీ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది.
చంద్రబాబు నాయుడు, నారాయణ(Narayana), లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.ఈ కేసులో నారా లోకేష్‌ను ఏ14గా పేర్కొంటూ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో సెప్టెంబర్ 26న ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కొంత మందికి లబ్ధి చేకూరేలా మార్పులు చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో పారిశ్రామికవేత్త లింగమనేని (Lingamaneni) రమేశ్ కుటుంబానికి లోకేష్ సాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లింగమనేని రమేష్ ఏ3గా ఉన్నారు.