ఐ-టీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ సోమవారం మంగళగిరి ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ సతీమణి భారతీ లక్ష్యంగా విజయ్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘భారతి పే’ అని పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఐ- టీడీపీ ద్వారా పోస్ట్ సర్క్యులేట్ చేశారని సీఐడీ పోలీసులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీన కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో గల విజయ్ ఇంటికెళ్లి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. దీనిపై విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరుకావాలని ధర్మాసనం తెలిపింది. వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేనని చెప్పగా, 30వ తేదీన ( ఈ రోజు) లాయర్ సమక్షంలో హాజరుకావాలని హైకోర్టు స్పష్టంచేసింది.
మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, విజయ్ తండ్రి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తదితరులతో కలిసి చింతకాయల విజయ్ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. వారందరినీ సీఐడీ పోలీసులు లోనికి రానీయలేదు. విజయ్, ఆయన లాయర్‌ను మాత్రమే కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. భారతి పే అంటూ చేసిన పోస్ట్‌పై ప్రశ్నలు వేస్తారు. విచారణలో ఆయన చెప్పే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.