»Chandrababu Did Not Lose Weight He Gained Weight Health Bulletin Released
Chandrababu Health: చంద్రబాబు బరువు తగ్గలేదు, పెరిగారు..హెల్త్ బులిటెన్ విడుదల
చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. బాబు జైల్లో బరువు తగ్గలేదని, ఇంకా బరువు పెరిగారని డీఐజీ రవికిరణ్ తెలిపారు. ఆయన బరువు తగ్గడంపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబీకులు, టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జైల్లో చంద్రబాబు నాయుడు 5 కేజీల బరువు తగ్గారని, మరో రెండు కేజీల బరువు తగ్గితే ఆయన ఆరోగ్యం ప్రమాదకరంగా మారుతుందని నారా భువనేశ్వరి, అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, అలర్జీ వల్ల ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ వైద్యులపై నమ్మకం లేదని, ఆయన పర్సనల్ వైద్యుల చేత చికిత్స చేయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బాబు ఆరోగ్యం (Chandrababu Health) గురించి వస్తున్న అసత్య ప్రచారంపై కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ (DIG Ravikiran) స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు. చంద్రబాబు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, అయితే ఆయన బరువు మాత్రం తగ్గలేదని వివరించారు. ఆయన 66 కిలోల నుంచి 68 కిలోల బరువు పెరిగారన్నారు. బరువు తగ్గారు అన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ వెల్లడించారు.
జైలులో ఉన్న బాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ కూడా వచ్చిందన్నారు. ప్రస్తుతం బాబుకు ఓఆర్ఎస్ ఇస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారంగానే జైలు అధికారులు పనిచేస్తున్నారని, దేశంలోని ఏ జైలులో కూడా ఏసీలు లేవని, రాజమండ్రి జైలులో సుమారు 2 వేల మంది ఖైదీలు ఉన్నారని, వారిలో కొందరికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని డీఐజీ రవికిరణ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం బాబుకు డీహైడ్రేషన్‌కు సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చారని, స్కిన్ ఎలర్జీకి కూడా మందులు అందిస్తున్నట్లు డీఐజీ వివరించారు. చంద్రబాబు శరీరంపై దద్దుర్లు వచ్చాయని, శుక్రవారం ఉదయం కూడా ఆయనకు వైద్యులు పలు పరీక్షలు చేసినట్లుగా తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్‌ను కూడా విడుదల చేసినట్లుగా కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ (DIG Ravikiran) తెలిపారు.