Tirumala:తిరుపతి ఏడుకొండల వాడికి బెంగళూరుకు చెందిన భక్తుడు భారీ విరాళం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. మురళీకృష్ణ అనే భక్తుడు శ్రీవారి దేవస్థానానికి దాదాపు 250 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వనున్నాడు. సైదాపురం మండలం పోతేగుంటలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. బెంగళూరు వాసి మురళీకృష్ణకు తిరుపతి జిల్లా డక్కిలి మండలం పోతేగుంటలో 90 ఎకరాలు, దగ్గవోలులో 160 ఎకరాలు, మొత్తం 250 ఎకరాల పోడు భూమి ఉంది. ఆ భూముల్లో టీటీడీకి అవసరమైన ఆహారోత్పత్తులు, పూలను సాగు చేసి తానే స్వయంగా అందజేసేందుకు ముందుకు వచ్చాడు. దీంతో అధికారుల బృందం నీటి సరఫరా, ఇతర సౌకర్యాలను పరిశీలించింది.
ఆ భూముల మ్యాప్‌ను పరిశీలించారు. భూ రికార్డుల మార్పుపై రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. అంతేకాదు.. స్వయంగా ఆ భూమిలో సహజ వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులను పండించి టీటీడీకి అప్పగించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన శ్రీ నల్ల విజయ్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి, తిరుచానూరు శ్రీ పద్మావతికి అగ్గిపెట్టెలో సరిపడే బంగారు చీరలను సమర్పించారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి వీటిని అందించారు. స్వామివారికి అగ్గిపెట్టెలో పట్టే రూ.45 వేల విలువైన బంగారు చీరను తయారు చేయించారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి 5 గ్రాముల బంగారు జరీ చీరను అగ్గిపెట్టెలో అమర్చారు.