ఏపీఎస్ ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ నెల 18న ఒక్కరోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. ఇందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో రికార్డుస్థాయి ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే గతంలో మాదిరి టిక్కెట్ ధరలను 50 శాతం పెంచలేదు. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపారు. అదనపు ఛార్జీల భారం లేకుంటే ప్రయాణీకులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనం. ఈ సంక్రాంతికి ప్రయాణికులు వారి ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. ఇతర ప్రైవేటు వాహనాలు మరియు సొంత వాహనాల కంటే ఆర్టీసీ వైపు మొగ్గు చూపారు.
ఈ సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా కూడా సరాసరిన ఒకరోజు ఎక్కువ ఆదాయం నమోదు చేయబడింది. ఒక్క రోజులో రూ.55 లక్షలు సాధించింది. అంతకు ముందు ఒకరోజు ఆదాయం రూ.45 లక్షలుగా రికార్డులో ఉంది. ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉండటం, నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడం, సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు బస్సులను పర్యవేక్షించడం, ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాటు వంటి వివిధ కారమాల వల్ల ఆర్టీసీ రికార్డుస్థాయి ఆదాయం ఆర్జించింది. డ్రైవర్లు, కండక్టర్లు, అధికారుల కృషి ఎంతో ఉంది. కార్గో పట్ల, ప్రత్యేక సర్వీసుల పట్ల ప్రయాణికులు చూపించిన ఆదరణ ఎప్పటికీ మరువలేనిదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.