జనసేనాని పవన్ కళ్యాణ్ ని వైసీపీ నేతలు టార్గెట్ చేశారనే విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఒకరి తర్వాత మరొకరు పవన్ పై వరసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి అమర్నాథ్(Minister Amarnath) పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలతో మేము తరచు సమావేశాలు నిర్వహించుకున్నామని చెప్పారు.
జనసేన పొలిటికల్ పార్టీ కాదు సినిమా పార్టీ అని విమర్శించారు. విధానం సిద్ధాంతం లేని జనసేన పార్టీ అంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ గురించి తాము మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. సినిమాల్లో ఉన్న వ్యక్తి సినిమా స్టైల్ లో మాట్లాడితే సినిమాల్లో పనికొస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో పనికిరాదని పేర్కొన్నారు.
దీనిని సమాజం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనసేన నేతలు కార్యకర్తలు పవన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబుకి జనసేన సైనికులు బానిసలుగా బతకాలంటూ కీలక కామెంట్స్ చేసారు. పవన్ కంటే కేఏ పాల్ నయమని ఎద్దేవా చేసారు. పాల్ తన పార్టీ 175 సీట్లు పోటీ చేస్తున్నది చెప్తున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలుస్తారనేది ఎప్పుడో ఊహించినదేనని వివరించారు. వారు కలవడం విడిపోవడం సహజమేనని అభిప్రాయపడ్డారు.
కాపుల కోసం ముద్రగడ పోరాటం చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అమరావతి రైతులు పాదయాత్ర పూర్తిగా మానుకోవాలని మేము కోరుతున్నామని మంత్రి అమర్నాధ్ సూచించారు.