ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో సమయంలో.. తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే… గుంటూరులోనూ చంద్రబాబు సభలోనే తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరస రెండు సంఘటలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో బహిరంగంగా రోడ్లపై ఎలాంటి సభలు, రోడ్ షోలు నిర్వహించడానికి వీలు లేదని ప్రకటించింది.
రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను వైసీపీ ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై, రోడ్డు మార్జిన్లలో.. సభలు, ర్యాలీలను అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులను పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది.