ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు (Disabled) గుడ్ న్యూస్ చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది.ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ (APPSC) నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఆర్డర్ నెంబర్ 77 ప్రకారం ఇక నుండి ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించి దివ్యాంగుల కోసం 4 శాతాన్ని రిజర్వేషన్(Reservation)ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, చెవిటివారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాల వారు దివ్యాంగుల జాబితాలో చేర్చారు.
అయితే, ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం (Govt) స్పష్టం చేసింది.వికలాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్–34 ప్రకారం ప్రభుత్వ నియామకాలు, పదోన్నతుల్లో నిర్ధారిత వైకల్యాల వ్యక్తులకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2020 ఫిబ్రవరి 19వ తేదీన మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది. ఇతర ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై ఉండాలని పేర్కొంది. దివ్యాంగుల కమిషన్ వెబ్సైట్లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.