చట్టం అందరికీ సమానమేనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా తాము ఎవరినీ మోసం చేయలేదన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు సాక్ష్యాలు, ఆధారాలతో అడ్డంగా, నిలువుగా దొరికిపోయారని అన్నారు. నిడదవోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం’ నిధులను నాలుగో ఏడాది విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని మోసాలు, వెన్నుపోట్లు పొడిచినా చివరికి తప్పులు చేస్తే అరెస్టు కాక తప్పదన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబును పలుకుబడికల్గిన ముఠా కాపాడిందన్నారు. ఈ క్రమంలో మళ్లీ తనను కాపాడేందుకు దొంగల ముఠా ప్రయత్నం చేస్తుందన్నారు. బాబును కాపాడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. బాబు దోపిడీలలో వారికి కూడా వాటాలు ఉన్నాయన్నారు.
అడ్డగోలుగా బ్లాక్ మనీ ఇస్తూ తెలంగాణ గత ఎన్నికల సమయంలో దొరికిపోయినా కూడా అప్పుడు అరెస్టు చేయలేదన్నారు. ప్రజలు ఈ విషయాలను పరిశీలించాలని జగన్ ప్రజలను కోరారు. మరోవైపు ఎల్లో మీడియా ఇలాంటి నిజాలను చూపించడం లేదన్నారు. అంతేకాదు వారు చేసే పనులకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా ఆడియో, వీడియో టేపులు చంద్రబాబువేనని చెప్పారని అన్నారు. తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో కూడా సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని చెప్పారు. బాబునే ఫేక్ అగ్రిమెంట్ చేయించి..13 సందర్భాలల్లో సంతకాలు పెట్టారని వెల్లడించారు. ఆ డబ్బును డొల్ల కంపెనీలకు ఎలా మళ్లీంచారో కేంద్ర సంస్థలు చెప్పాయన్నారు. ఇలాంటి నేతల విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.
తాము మ్యానిఫెస్టులో చెప్పిన దానికంటే ఎక్కువగానే ప్రజలకు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 12 శాతం కాపులకు దక్కాయని గుర్తుచేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీం ద్వారా ఇప్పటివరకు ఐదేళ్లలో లబ్ధిదారులకు రూ.75000 పంపిణీ చేసినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.