ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. ముఖ్యంగా పవన్ పై వైసీపీ(ysrcp) దాడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో…. టీడీపీ(tdp), జనసేన(janasena party) పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దిశగానే రెండు పార్టీలూ అడుగులు ముందుకేస్తున్నాయి కూడా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. అరాచక పాలన చేస్తోన్న వైసీపీని గద్దె దించడానికి, అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అయితే, ‘ఇది పొత్తుల గురించి మాట్లాడే సందర్భం కాదనీ, ఎన్నికల గురించి మాట్లాడటం ఇప్పుడు సబబు కాదనీ.. అసలంటూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వుంటే, ఎన్నికల గురించి మాట్లాడొచ్చనీ, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందనీ, దాన్ని బతికించాక ఎన్నికల గురించి మాట్లాడొచ్చనీ’ జనసేనాని అభిప్రాయపడ్డారు.
మరోపక్క, టీడీపీ మాత్రం తమతో జనసేన కలిసి రావాలని అంటోంది. బీజేపీ కూడా అన్ని విపక్షాలు ఒక్కటై, వైసీపీని ఓడించాలని అంటోంది. బీజేపీ అంటే, బీజేపీలో నేతలందరూ అని కాదు ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ తదితరులు ఈ అభిప్రాయంతో వున్నారు.
ఇదిలా వుంటే టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తు కుదిరితే తమకు టిక్కెట్లు దొరకవన్న భావనతో వున్న కొందరు బీజేపీ నేతలు, తెలివిగా జనసేనలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో కన్నా లక్ష్మినారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. ఆయన వెంటే మరికొందరు బీజేపీ నేతలు కూడా… జనసేనలో చేరాలని ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం.