»Ap 50 Ycp Mlas Ready To Jump Raghuramakrishna Raju
AP: 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యేందుకు సిద్ధం: రఘురామకృష్ణ రాజు
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేన పార్టీల్లోకి వెళ్లనున్నారని, త్వరలోనే ఆ పని జరుగుతుందని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. వైసీపీ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నుంచి అతి త్వరలోనే 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనలోకి జంప్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆ రెండు పార్టీల్లో చేరే అవకాశం లేకపోతే వారిలో కొందరు కాంగ్రెస్ గూటికి చేరుతారని చెప్పారు.
వైసీపీకి ఆ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పే రోజు అతి త్వరలో రానుందని అన్నారు. ఏపీ నుంచి ఖాళీ కానున్న మూడు ఎంపీ పదవులలో వైసీపీకి ఒక్కటి కూడా దక్కదని రఘురామకృష్ణ రాజు జోష్యం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ చేసిందేమీ లేదన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని, వైసీపీని సాగనంపేందుకే అందరూ కాసుకుని కూర్చున్నారన్నారు.
ఏపీలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగులంతా జగన్ సర్కార్ పై కోపంగా ఉన్నారన్నారు. జగనన్నను ఢీకొట్టడానికి ఆయన బాణం షర్మిల కూడా రంగంలోకి దిగిందని, టీడీపీ, జనసేన ఉమ్మడిగా గెలిచి విజయం సాధిస్తుందని రఘురామకృష్ణ రాజు అన్నారు. బాబు పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, బాబు వస్తే జాబ్స్ వస్తాయని, కంపెనీలు వస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని చాలా మంది ఆశిస్తున్నట్లుగా తెలిపారు.