పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) సంబంధించి గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల సమస్యలు వచ్చాయని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) శుక్రవారం ఆరోపించారు. ఆ కారణంగానే ఆలస్యమవుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) సంబంధించి గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల సమస్యలు వచ్చాయని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) శుక్రవారం ఆరోపించారు. ఆ కారణంగానే ఆలస్యమవుతోందన్నారు. గత ప్రభుత్వం కాఫర్ డ్యాం పనులను గాలికి వదిలేసిందని, తాము యుద్ధ ప్రాతిపదికన ఎత్తు పెంచినట్లు చెప్పారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకోవాలని, కానీ కేంద్రం నుండి నిధులు రాకపోయినప్పటికీ పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుండి నిధుల కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వివిధ పనులను దగ్గరుండి సమీక్షించారు. ఇటీవల కేంద్ర బృందాలు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి డయాఫ్రమ్ వాల్ నాణ్యత ప్రమాణాల పరిశీలనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు అంబటి పర్యటిస్తున్నారు. ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న లోయర్ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ , జట్ గ్రౌటింగ్, గైడ్ బండ్ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టు నిర్మాణ పరిశీలనలో భాగంగా తొలత ఎగువ, దిగువ కాఫర్ డ్యాం,డయా ఫ్రమ్ వాల్ ,జెట్ గ్రౌటింగ్, గైడ్‌బండ్, పనులను పరిశీలించినట్లు చెప్పారు. పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోందన్నారు. డయా ఫ్రంవాల్ నిర్మాణ విషయంలో నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ అధికారుల, నిపుణుల పరీక్షల నివేదికల తెలిసే వరకు పోలవరం ప్రాజెక్టు ఎంత వరకు జాప్యం జరుగుతుందో తెలియదన్నారు. నిర్మాణం పనులు సావధానంగా చేస్తామని, గత ప్రభుత్వంలా తొందరపాటు చర్యలు తీసుకునేది లేదన్నారు… అలా అని ఆలస్యం చేయమని… తాము అధికారంలో ఉండగానే పూర్తి చేస్తామన్నారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోమని స్పష్టం చేశారు. తాను మంత్రిని అయ్యాక చంద్రబాబుతో సహా చాలామంది ఆలస్యమంటూ విమర్శలు చేస్తున్నారని, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని అడుగుతున్నారని మండిపడ్డారు. కానీ చెప్పిన టీడీపీ మాత్రం దానిని పూర్తి చేయలేదని విమర్శించారు.
ఆర్ అండ్ ఆర్ పరిహారాల విషయంలో నిర్వాసితులకు18 వందల పునరావాస కాలనీలు తమ ప్రభుత్వ పాలనలోనే నిర్మించామన్నారు. 41.17 కాంటూర్ పరిధిలో నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే 3 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిందని, రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏం పనులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నిదులిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వాస్తవానికి కేంద్రమే చేయాలి టీడీపీ ప్రభుత్వం కావాలనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తామే చేస్తామని ప్రాజెక్టుని ఈ స్థాయికి తీసుకు వచ్చిందని మండిపడ్డారు. తుంగభద్ర నదిపై కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తోందన్నారు.