జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా తిరగనీయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలకు తోడు, ఇప్పడుు పవన్ ఎన్నికల ప్రచారరథం వారాహి పైన వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు. వారాహి రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ తెలంగాణలో జరిగిందని తెలిసిన అనంతరం వైసీపీ వ్యాఖ్యలు చూస్తుంటే, భయంతో పవన్ కళ్యాణ్‌ను తిరగకుండా చేయాలనే ఉద్దేశ్యం కనిపిస్తోందని జనసేన భావిస్తోంది.
2024 ఎన్నికలకు సమాయత్తమవుతున్న పవన్ తన ప్రచారం కోసం వారాహి వాహనాన్ని వారం క్రితం లాంచ్ చేసి, ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ వాహనానికి సంబంధించిన ఫోటోలు తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసినప్పటి నుండి వారాహి చుట్టూ రాజకీయం రాజుకుంది. పవన్ ఎన్నికల ప్రచార రథం ఆలివ్ గ్రీన్ రంగులో ఉందని, ఇది ప్రయివేటు వాహనాలకు నిషేధిత రంగు అని, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 ప్రకారం ఈ రంగు వాడకూడదని, కేవలం మిలిటరీ వాహనాలకు మాత్రమే ఈ రంగు పరిమితమని, కాబట్టి రిజిస్ట్రేషన్ జరగదని ఈ ఫోటోలు వెలుగు చూసిన వెంటనే స్పందించారు ఏపీ రవాణా శాఖమంత్రి పేర్ని నాని. అంటే, నిబంధనలకు విరుద్ధంగా రంగు ఉన్నందున తాము రిజిస్ట్రేషన్ చేయబోమని చెప్పారు.
అయితే, అది అప్పటికే లేదా ఆ తర్వాత గానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయింది. దీనికి తెలంగాణ అధికారులు చెబుతున్న మాట ఏంటంటే, ఆ వాహనం నిషేధిత ఆలివ్ గ్రీన్ రంగులో లేదని, ఎమిరాల్డ్ గ్రీన్‌లో ఉందని, అలాగే, వాహనానికి నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశామని చెబుతున్నారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన విషయం తెలిసి, వైసీపీ నేతలు నిన్న మళ్లీ స్పందిస్తున్నారు. పవన్ తెలంగాణలో తిరగడానికి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారేమోనని, ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడి నిబంధనల ప్రకారం ఉందా లేదా చూస్తామని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఇక్కడ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే తిరగనిస్తాం అనేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఏ వాహనం అయినా ఏ రాష్ట్రంలో అయినా తిరగవచ్చుననే విషయం వారికి తెలియదా అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.