గెలుపు పట్టుదలతో పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేశారా?
ముఖ్యమంత్రి పదవిపై టీడీపీతో పంపకాల లెక్క పూర్తయిందా?
జూనియర్ ఎన్టీఆర్కే ఛాన్స్ ఇవ్వని బాబు జనసేనానికి ఇస్తారా?
అదే జరిగితే ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరా?
బాబుకు దూరం జరిగితే నేడు కాకపోయినా రేపైనా భవిష్యత్తు ఉండేదా?
పవన్ వెయిటింగ్ కాలం పెరిగిందా?
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీని స్థాపించి దాదాపు పదేళ్లు కావొస్తుంది. 2014లో మద్దతు, 2019లో ఒంటరిగా పోటీ చేసి చేయి కాల్చుకున్నారు. మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, పవన్ వ్యక్తిత్వం ఆయన రాజకీయాల్లోకి రావడానికి దోహదపడ్డాయి. ప్రజలకు ఏదో చేయాలనే ఆయన తపన, సామాన్యుల తరఫున ప్రభుత్వాలపై ఉద్యమిస్తున్న తీరు ఎంతో మందికి నచ్చింది. అయితే సహజంగా ఆయనలో ఉన్న ఆవేశం.. నిర్ణయాలపై కూడా ప్రభావం చూపి, ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత మూడున్నరేళ్లుగా ప్రతిపక్ష ఓట్లను వచ్చే ఎన్నికల్లో చీల్చనివ్వనని చెప్పిన జనసేనానీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ప్రయత్నాలు చేసినప్పటికీ, విఫలం కావడంతో చంద్రబాబు దారిలో నడిచారు. ఆయన ఇక్కడే తప్పటడుగు వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన భావించినట్లుగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుతో మెజార్టీ ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండటం ద్వారా ఈ కూటమి గెలిస్తే, ముఖ్యమంత్రి పీఠం కూర్చోబోయేది ఎవరో అందరికీ తెలిసిందే.
చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోను పవన్‌కు అవకాశం ఇవ్వడని అంటున్నారు. ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. లోకేష్‌కు అడ్డుపడతాడనే ఉద్దేశ్యంతో 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉపయోగించుకొని, ఆ తర్వాత పక్కన పెట్టారని గుర్తు చేస్తున్నారు. తనయుడి కోసం అల్లుడిని పక్కన పెట్టిన చంద్రబాబుకు పవన్ ఒక లెక్క కాదని గుర్తు చేస్తున్నారు. 2014లో బీజేపీతో కలిసి, ఆ తర్వాత ఎన్నికలకు ఆరు నెలల ముందు యూటర్న్ తీసుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఆయన అధికారమే లక్ష్యంగా మాత్రమే పావులు కదుపుతారని, ఆ వలలో పవన్ పడిపోయారని అంటున్నారు. ఎప్పుడూ ఒకే పార్టీకి అధికారమా అని గతంలో పవన్ ప్రశ్నించారు. ఆ ప్రశ్న ప్రకారం టీడీపీ-జనసేన ముఖ్యమంత్రి పదవిని అయిదేళ్ళ కాలానికి గాను పంచుకుంటే ఇబ్బంది లేదు. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఢోకాలేదని అంటున్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేజార్చుకోడనేది పలువురి అభిప్రాయం.
2024 ఎన్నికల కోసం టీడీపీతో కలయికకు సంబంధించి పవన్ లెక్క సరిగ్గానే ఉండవచ్చునని, కానీ ఆయన భవిష్యత్తుకు మాత్రం ఇది తప్పటడుగే అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి, జనసేనానికి అవకాశం ఇవ్వకుంటే, పవన్ తన భవిష్యత్తును తానే చెడగొట్టుకున్న వారు అవుతారని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక తనయుడి కోసం పవన్‌ను పక్కన పెడతారనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షంలో ఉండే జగన్ నేతృత్వంలోని వైసీపీ పోరాడుతుంది. ఒకవేళ పవన్ ప్రశ్నించుదామని వచ్చినా, మద్దతిచ్చింది మీరే కదా అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మళ్లీ టీడీపీ, వైసీపీలు ఒకటి రెండో స్థానంలో ఉంటే, జనసేన మూడోసారి కూడా మూడో స్థానానికే పరిమితమవుతుంది. ఆ తర్వాత వచ్చే 2029 ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్యే పోరు ఉంటుంది. అంటే సుదీర్ఘ కాలం టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్‌లో పవన్ తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారని అంటున్నారు.
ఇక రెండో అంశం. టీడీపీకి దూరం జరిగి, బీజేపీతో కలిసినా లేదా ఒంటరిగా పోటీ చేసినా, వరుసగా రెండు మూడుసార్లు నష్టపోయినా, క్రమంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇందుకు వైసీపీ అధినేత జగన్ ప్రత్యక్ష సాక్ష్యం. పార్టీ పెట్టి, ఎనిమిదేళ్ల పాటు ఒంటరి పోరాటం చేశారు. పవన్ కూడా దీనిని అనుసరిస్తే ప్రయోజనంగా ఉండేదని అంటున్నారు. బీజేపీ వంటి చిన్న పార్టీలతో కలిసి వెళ్లినా, అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షంలో కూర్చున్నా పవన్ కళ్యాణే నాయకుడు అవుతారు. ఇన్నాళ్లు రెడ్డి, కమ్మలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున, కాపులకు ఓసారి అవకాశం ఇద్దామని భావిస్తే, 2024లోనే చిన్నా చితక పార్టీలతో కలిసి, అవకాశమొస్తే, పవన్ కళ్యాణ్‌కు ముఖ్యపదవి దక్కుతుంది. ప్రతిపక్షమైనా ఆయనే నాయకుడు. ఎలా చూసినా ఆయనకు రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే టీడీపీ వెనుకబడిందని, పవన్ ఒంటరిగా వెళ్తే ఆయన ముందుకు వస్తారని గుర్తు చేస్తున్నారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే 2024లో ముఖ్య పదవి లేదా ప్రతిపక్ష నేత, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేన కీలకంగా మారుతుందని అంటున్నారు. అంటే ఒంటరిగా లేదా చిన్న పార్టీలతో వెళ్తే సమీప కాలంలో ప్రయోజనం ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో మాత్రం బాగుంటుందని అంటున్నారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు అయితే పవన్ వెయిటింగ్ కారం పెరిగినట్లే అంటున్నారు.