సినీ నటి అమలాపాల్‌ను కేరళలోని ఓ దేవాలయంలోకి రానివ్వలేదు అధికారులు. ఎర్నాకులంలోని తిరువైరనిక్కులం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా అధికారులు తనను ఆపారని అమలాపాల్ ఆరోపించారు. ప్రముఖ హిందూ దేవాలయాలకు ఓ రూల్ బుక్ ఉంటుంది. అందులోని నిబంధనలను అధికారులు, పూజారులు కచ్చితంగా పాటిస్తారు. కేరళలోని తిరువైరనిక్కులం మహదేవ ఆలయంలోని నిబంధనలను పాటించి అమలాపాల్ ని ఆలయ ప్రవేశం నిరాకరించామని అధికారులు చెప్పారు.
తనకు ఈ దేవాలయంలోకి అనుమతిని నిరాకరించారని అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు దైవ దర్శనం నిరాకరించారని, ఆలయం ముందున్న అమ్మవారి దర్శనం చేసుకోమని తనకు సూచించారని అమలాపాల్ పేర్కొన్నారు. 2023లోను మతపరమైన వివక్ష విచారకరమన్నారు. ఈ సందర్భంగా సందర్శకుల రిజిస్టర్లో అమలా పాల్ తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను అమ్మవారిని చూడలేకపోయినప్పటికీ, ఆత్మను అనుభవించానని సదరు నటి పేర్కొన్నారు. 2023లోను మతపరమైన వివక్ష కొనసాగడం విచారకరమని, ఈ విషయం తనను నిరాశపరిచిందని, అమ్మవారి వద్దకు వెళ్లలేకపోయానని, కానీ దూరం నుండి ఆత్మను ప్రార్థించానని పేర్కొన్నారు. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని, సమయం వస్తుంది మనమందరం మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూస్తారని ఆలయ సందర్శకుల రిజిస్టర్లో రాశారు.
దీనిపై దేవాలయ ట్రస్ట్ సెక్రటరీ ప్రసూన్ కుమార్ మాట్లాడుతూ… గురువాయుర్ లాగా తిరువైరనిక్కులం ఆలయంలోకి కూడా కేవలం హిందువులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర మతానికి చెందిన వారు కూడా ఇక్కడకు రావడం లేదని తాను చెప్పడం లేదని, కానీ ఇలాంటి సెలబ్రిటీలు వచ్చినప్పుటు కాంట్రవర్సీ అవుతోందన్నారు. అమలాపాల్ ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయలేదు. ఆసక్తికర అంశం ఏమంటే తన ఇన్‌స్టాలో మరో ఇద్దరితో కలిసి తన నుదిటిపై బొట్టు పెట్టుకొని, ఓ ఆలయ ప్రాంగణంలో నిలుచున్న ఫోటో ఉంది. ఇది 24 గంటలు మాత్రమే కనిపిస్తుంది.